Mindtree And L&T Merged: ఖాతాదారుల నుంచి పెద్ద ఒప్పందాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీలను విలీనం చేస్తున్నట్లు.. ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా కలిగిన ఎల్ అండ్ టీ గ్రూప్ శుక్రవారం ప్రకటించింది. దీంతో దేశంలోనే ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీ అవతరించనుంది. ఇరు కంపెనీల సంయుక్త ఆదాయం 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27,000 కోట్లు) కాగా, మొత్తం 80,000 మంది సిబ్బంది ఉంటారు. విలీన సంస్థను 'ఎల్‌టీఐమైండ్‌ట్రీ' గా వ్యవహరించనున్నారు. ఈ సంస్థకు దేవశిష్ ఛటర్జీ నేతృత్వం వహిస్తారు. మొత్తం 11 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
మొత్తం షేర్ల రూపంలోనే..మొత్తం షేర్ల ద్వారా జరిగే ఈ ఒప్పందం కింద ప్రతి 100 మైండ్ ట్రీ షేర్లకు 73 ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) షేర్లు లభిస్తాయని ఎల్ అండ్ టీ పేర్కొంది. విలీన సంస్థలో ఎల్ అండ్ టీకి 68.73 శాతం వాటా ఉంటుంది. జారీ అయిన కొత్త ఎల్‌టీఐ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ట్రేడవుతాయి. వ్యక్తిగత కారణాల రీత్యా ఎల్‌టీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ జలోనా రాజీనామా చేసినట్లు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎ.ఎం. నాయక్ తెలిపారు.
విలీనం ఇందుకే.. 'ప్రస్తుతం ఈ 2 కంపెనీల సగటు ఒప్పంద పరిమాణం 25 మిలియన్ డాలర్లుగా ఉంది. తక్కువ ఆదాయం, చిన్నమొత్తం బ్యాలెన్స్ షీట్లు ఉండడం వల్ల పెద్ద ఒప్పందాలకు జరిగే బిడ్లలో పాల్గొనలేకపోతున్నట్లు ఎల్ అండ్ టీ మేనేజ్‌మెంట్ భావించింది. రెండు కంపెనీల విలీనం అనంతరం పెద్ద ప్రాజెక్టులకు పోటీపడటానికి వీలవుతుంది. 100 మి. డాలర్లకు పైగా విలువైన ఒప్పందాలకు బిడ్‌లు వేసే స్థాయికి వెళతామ'ని నాయక్ పేర్కొన్నారు.
అయిదేళ్లలో 1000 కోట్ల డాలర్ల ఆదాయానికి.. ప్రస్తుతం ఇరు కంపెనీల సంయుక్త ఆదాయం 3.5 బి. డాలర్లు (దాదాపు రూ.27,000 కోట్లు)గా ఉంది. అయిదేళ్లలో ఇది 1000 కోట్ల డాలర్ల (సుమారు రూ.77,000 కోట్ల)కు చేరుతుందని నాయక్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని బడ్జెట్లు, లక్ష్యాలను స్వతంత్రంగా ఇరు కంపెనీలు 2022-23 కల్లా పూర్తి చేస్తాయని అన్నారు. విలీన ప్రక్రియ కోసం ఒక ఏకీకృత కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
అదనంగా 15-20 శాతం నియామకాలు.. ఉద్యోగులను ఎవరినీ తొలగించడం లేదని నాయక్ స్పష్టం చేశారు. సేవలకు గిరాకీ బలంగా ఉండడం వల్ల అదనంగా 15-20 శాతం నియామకాలు చేపడతామన్నారు. వలసల రేటును 1 శాతం మేర తగ్గించగలమన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో గ్రూప్ మార్కెట్ విలువలో 40 శాతం ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ఐటీ సేవల సంస్థల ద్వారానే లభిస్తాయన్నారు. ఎల్‌టీఐని 2000లో ఎల్ అండ్ టీనే ఏర్పాటు చేయగా.. 2003లో మైండ్‌ట్రీని కొనుగోలు చేసింది. గత మూడేళ్లలో మైండ్‌ట్రీ విలువ 5 రెట్లు పెరిగిందని నాయక్ గుర్తు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరిశ్రమకు సానుకూలతలు పెరుగుతాయని నాయక్ అంచనా వేశారు. ఉక్రెయిన్‌లో 6 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుండగా.. అందులో 3 లక్షల మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు. కాబట్టి భారత ఐటీ కంపెనీలు ఈ గిరాకీని అందిపుచ్చుకోవచ్చని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: జొమాటో సీఈఓ బంపర్ ఆఫర్.. విరాళంగా ఉద్యోగులకు రూ.700 కోట్లు!