LPG cylinder price: వాణిజ్య వినియోగ సిలిండర్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. దిల్లీలో రూ. 250 మేర పెంచాయి చమురు సంస్థలు. ఈ పెంపుతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర దిల్లీలో రూ.2,253కు చేరింది. హైదరాబాద్లో రూ.273.5 పెంపుతో సిలిండర్ ధర రూ. 2,460కి చేరింది. గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు లేకపోవడం ఊరట కలిగించే అంశం. విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కిలోలీటర్పై 2 శాతం(రూ.2258.54) మేర పెంచాయి ఇంధన సంస్థలు. ఈ పెంపుతో దిల్లీలో కిలోలీటర్ రూ.1,12,924.83కి చేరింది. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు ఈ స్థాయికి చేరడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా చమురు/ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం విమాన ఇంధన ధరలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటీఎఫ్ ధరలను ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తారు. ఈ ఏడాది ధరలు పెరగడం వరుసగా ఇది ఏడోసారి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరగడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏటీఎఫ్ ధర 50 శాతం(రూ.38,902.92) పెరగడం గమనార్హం.
Petrol Rates: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. గత 11 రోజుల్లో 9 రోజులు రేట్లు పెంచగా.. రెండు రోజులు కాస్త విరామం ఇచ్చాయి చమురు సంస్థలు. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.93.07గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.72, డీజిల్ ధర రూ.100.94 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.117.32, డీజిల్ రూ.103.10 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది.
ఇవీ చూడండి: ఇదే సరైన సమయం.. నేటి నుంచి ఇలా చేద్దాం..
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం