LIC Policy Revival Process : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. జీవిత బీమా, ఆరోగ్య బీమా సహా అనేక రకాల బీమా సౌకర్యాలను కల్పిస్తోంది. ఇవి కష్టసమయంలో పాలసీదార్లకు అండగా నిలుస్తాయి. ముఖ్యంగా పాలసీదారులకు దురదృష్టవశాత్తు ఏదైనా తీవ్రమైన ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైనా, లేదా మరణించినా.. అతని కుటుంబానికి ఎల్ఐసీ పాలసీ ఆర్థికంగా భరోసాను కల్పిస్తుంది. అందుకే నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, జీవిత బీమాలు ఉండడం తప్పనిసరి.
ప్రీమియం సకాలంలో చెల్లించాలి!
చాలా మంది ఎల్ఐసీ పాలసీలు తీసుకొని, కొంత కాలం తరువాత ప్రీమియం చెల్లించడం మరిచిపోవడం లేదా పూర్తిగా మానేయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. బీమా పాలసీలు తీసుకున్న తరువాత సకాలంలో అందుకుతగ్గ ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే పాలసీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. లేదంటే, పాలసీ కవరేజ్‌ను కోల్పోవాల్సి వస్తుంది.
ఎల్ఐసీ పాలసీ ఎప్పుడు రద్దు అవుతుంది?
పాలసీదారులు వరుసగా 3 దఫాలు ప్రీమియం చెల్లించకుండా ఉంటే ఎల్ఐసీ పాలసీ రద్దు అవుతుంది. అయితే పాలసీదార్లకు అప్పటికి కూడా 15 నుంచి 30 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మరలా ప్రీమియం మొత్తం చెల్లించి, పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గ్రేస్ పీరియడ్ ముగిసే వరకు కూడా పాలసీదారులకు బీమా కవరేజ్ ఉంటుంది. ఒక వేళ ఈ గ్రేస్ పీరియడ్లోపు పాలసీని పునరుద్ధరించుకోకపోతే.. అప్పుడు సదరు పాలసీ పూర్తిగా రద్దు అవుతుంది. అందుకే ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. పాలసీ హోల్డర్లు సకాలంలో ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తూ ఉండాలి.
రద్దు అయిన ఎల్ఐసీ పాలసీని పునరుద్ధరించవచ్చా?
LIC Policy Revival Period : ఎల్ఐసీ పాలసీ రద్దు అయిన తరువాత పాలసీ హోల్డర్లకు ఎలాంటి బీమా ప్రయోజనాలు లభించవు. అందుకే ఎల్ఐసీ.. తమ కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించింది. ఎల్ఐసీ పాలసీ రద్దు అయిన 2 ఏళ్లలోపు మళ్లీ దాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
రద్దు అయిన ఎల్ఐసీ పాలసీని పునరుద్ధరించడం ఎలా?
How To Revive Lapsed Life Insurance Policy : ఎల్ఐసీ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా పునరుద్ధరణ ఛార్జీలు, ఆలస్య రుసుము, అదనపు వడ్డీ లేదా పెనాల్టీ చెల్లించి.. ల్యాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు. వాస్తవానికి, రద్దు అయిన ఎల్ఐసీ పాలసీని పునరుద్ధరించుకోవాలని అనుకునేవాళ్లు.. ముందుగా ఎల్ఐసీ ఏజెంట్లను కలవడం ఉత్తమం. ఎందుకంటే.. ఈ ఏజెంట్ల సాయంతో ఎల్ఐసీ బీమా పాలసీలను పునరుద్ధరించుకోవడం సులభం.
ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ స్కీమ్
LIC Policy Revival Scheme 2023 :
ఎల్ఐసీ పాలసీదార్ల కోసం.. స్పెషల్ రివైవల్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీ ఎల్ఐసీ పాలసీని పునరుద్ధరించమని ఒక దరఖాస్తును సమర్పించాలి.
- దరఖాస్తుతో పాటు పాలసీ డాక్యుమెంట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఇవ్వాలి.
- అవసరమైతే మెడికల్ రిపోర్ట్/ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఎల్ఐసీ సంస్థ.. మీ పాలసీ రివైవల్ అమౌంట్‌ను లెక్కించి చెబుతుంది. అందుకు అనుగుణంగా..
- ఎల్ఐసీ రెన్యూవల్ ఛార్జీలు, ఆలస్య రుసుము, అదనపు వడ్డీ లేదా పెనాల్టీ చెల్లించాలి.
- ఎల్ఐసీ మీ దరఖాస్తును పరిశీలించి, మీ బీమా పాలసీని పునరుద్ధరిస్తుంది. అంతే కాదు సరికొత్త పాలసీ డాక్యుమెంట్‌ను కూడా మీకు అందిస్తుంది.