Latest Viral news : ఒక అమ్మాయి కాస్త తెల్లగా ఉందనే కారణంతో, ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయని వింత ఘటన బెంగళూరులో జరిగింది. ప్రతీక్ష జీచ్కర్ అనే అమ్మాయికి ఈ చేదు అనుభవం ఎదురైంది.
బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ఉద్యోగ ప్రకటన చేసింది. దానికి ప్రతీక్ష అనే అమ్మాయి దరఖాస్తు చేసుకుంది. మొదట ఆమె కంపెనీ పెట్టిన ఒక పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. తరువాత వాళ్లు ఆమెను మూడు రౌండ్ల పాటు ఇంటర్వ్యూ కూడా చేశారు. కానీ ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయలేదు. దీనికి వాళ్లు చెప్పిన కారణం వింటే మీరు కచ్చితంగా నోరు వెళ్లబెడతారు.
" మీ ప్రొఫైల్ మేము చూశాం. మీకు మా కంపెనీ ఉద్యోగానికి కావాల్సిన అన్ని విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్నాయి. కానీ మా సంస్థ.. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తుంది. మీరు మా ఇంటర్నల్ టీమ్‌లోని మిగతా సభ్యుల కంటే భిన్నంగా చాలా తెల్లగా ఉన్నారు. అందువల్ల మేము మిమ్మల్ని ఉద్యోగానికి ఎంపిక చేయలేకపోతున్నాము."
- కంపెనీ ఈ-మెయిల్
తెల్లగా ఉండడం నేరమా?
LinkedIn viral post : కంపెనీ ఈ-మెయిల్ చూసి అవాక్కయిన ఆ అమ్మాయి.. దాని స్క్రీన్ షాట్‌ను లింక్డ్ఇన్లో షేర్ చేశారు. కానీ ఆమె సదరు కంపెనీ పేరు తెలియకుండా బ్లర్ చేశారు.
"నేను కంపెనీ పంపిన ఈ-మెయిల్ చూసి షాక్ అయ్యాను. దిగ్భ్రాంతికి లోనయ్యాను. శరీరం రంగును కాకుండా వ్యక్తుల నైపుణ్యాలు చూసి ఉద్యోగం ఇవ్వాలని, సదరు కంపెనీని కోరుతున్నాను."
- ప్రతీక్ష, లింక్డ్ఇన్ పోస్టు
ప్రతీక్ష పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ, ఏ హెచ్ఆర్ కూడా ఇలాంటి కారణాలతో ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేయకపోవడం గురించి తాము వినలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో రచ్చరచ్చ!
Latest Social Media Viral news : బిజినెస్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్లోనే కాదు.. ఇప్పుడు ఈ పోస్టు కాస్త మిగతా సోషల్ మీడియా వేదికల్లోనూ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ట్విట్టర్, రెడిట్ (Reddit)లో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ మరికొందరు ఆమె పెట్టిన పోస్టుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాస్తవమైనదేనా అని ప్రశ్నిస్తున్నారు.
"ఇలా జరగడానికి అవకాశం లేదు. వాస్తవానికి కంపెనీలు చాలా సార్లు అన్యాయమైన పద్ధతుల్లో కొంత మందికి ఉద్యోగాలు నిరాకరిస్తూ ఉంటాయి. కానీ ఏ కంపెనీ, ఏ హెచ్ఆర్ కూడా ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ (తెల్లగా ఉన్నారనే కారణంతో) ఉద్యోగానికి ఎంపిక చేయకపోవడం జరగదు. ఇది కాస్త అతిశయోక్తి లాగా అనిపిస్తోంది."
- రెడిట్ యూజర్
"ఇది కచ్చితంగా ఒక ఫేక్ న్యూస్. హెచ్ఆర్లు ఎప్పుడూ ఇలాంటి విషయాలను ఫోన్లోగానీ, ముఖాన గానీ చెప్పరు. ఒక వేళ ఈ-మెయిల్ పంపించినా, తెల్లగా ఉన్నారనే కారణంతో ఉద్యోగం ఇవ్వడం లేదని చెప్పరు. అసలు ఇలా జరగడానికి ఆస్కారమే లేదు."
- ఓ నెటిజన్
"నేను లింక్డ్ఇన్లో ప్రతీక్ష పెట్టిన పోస్టు చూశాను. ఇది కచ్చితంగా నిజం కాదు. ఇది కేవలం పబ్లిషిటీ స్టంట్‌లాగా కనిపిస్తోంది."
- మరో నెటిజన్
LinkedIn Prathiksha Jucker Viral Post : సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా కొంత మంది కామెంట్స్ పెడుతుండడం వల్ల ప్రతీక్ష తన పోస్టు కామెంట్ సెక్షన్‌ను టర్న్ ఆఫ్ చేసేశారు.