Jio AirFiber News : జియో ఎయిర్‌ఫైబర్‌ను గణేష్ చతుర్థి పర్వదినాన (సెప్టెంబర్ 19)న లాంఛ్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తెలియజేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ అంశాన్ని ప్రకటించారు.
మార్కెట్ స్వీప్
Reliance Jio Market Strategy : భారతదేశంలో 200 మిలియన్లకు పైగా ఉన్న గృహాలకు 5జీ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో జియో ఎయిర్‌ఫైబర్‌ను తీసుకొస్తున్నట్లు ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఈ విధంగా ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని 5జీ సెగ్మెంట్‌ను తమ జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా సొంతం చేసుకోవాలని రిలయన్స్ వ్యూహం రచించింది.
జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏమిటి?
What Is Jio Airfiber : జియో ఎయిర్‌ఫైబర్ అనేది ఫైబర్ లాంటి వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. కానీ ఇది పూర్తిగా వైర్ లెస్ టెక్నాలజీ. అంటే ఎలాంటి వైర్లు లేకుండానే ఫైబర్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది జియో ఎయిర్‌ఫైబర్. వినియోగదారులు కేవలం ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే చాలు. వాళ్ల ఇంట్లోనే వ్యక్తిగత వై-ఫై హాట్‌స్పాట్ క్రియేట్ అవుతుంది.
సూపర్ స్పీడ్ ఇంటర్నెట్
Jio Airfiber Internet Speed : జియో ఎయిర్‌ఫైబర్ అనేది ఒక ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సొల్యూషన్. దీనిని మీ ఇంట్లో లేదా కార్యాలయాల్లో సులువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ జియో ఎయిర్‌ఫైబర్ 1 Gbps వేగంతో ఎలాంటి ఆటంకం లేకుండా హై-స్పీడ్ కనెక్టివీటీని అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌టీవీ, సెట్-టాప్ బాక్స్ ఇలా అన్ని పరికరాలను ఏకకాలంలో కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఒకేసారి ఎన్ని పరికరాలకు వై-ఫై కనెక్ట్ చేసినప్పటికీ ఇంటర్నెట్ వేగం మాత్రం తగ్గదు.
వీపరీతంగా డేటా వాడుతున్నారు!
Reliance Jio Users In India : జియో టెలికాం సర్వీసెస్‌ను ఏడేళ్ల క్రితం ప్రారంభించారు. దీనికి విశేషంగా ఆదరణ కూడా లభించి.. యూజర్ బేస్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 45 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం జియో మొబైల్ నెట్వర్క్ వాడే ఒక్కో యూజర్.. సగటున నెలవారీగా 25 జీబీ వరకు డేటా వినియోగిస్తున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా!
Jio 5g Network In India : ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 96 శాతం వరకు జియో 5జీ సేవలు అందిస్తున్నారు. అయితే 2023 డిసెంబర్‌లోపు దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరించనున్నట్లు ముకేశ్ స్పష్టం చేశారు.
రిలయన్స్ జియో ప్రస్థానం
Reliance Jio History : రిలయన్స్ జియో 2022 అక్టోబర్‌లో దేశంలో 5జీ సేవలు ప్రారంభించింది. దీని ద్వారా అంతకు ముందు ఉన్న 3జీ, 4జీ కంటే మంచి వేగవంతమైన ఇంటర్నెట్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తక్కువ సమయంలో చాలా ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయడానికి వీలు కలిగింది.