Belated ITR Return Last Date : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2023 జులై 31తో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ గడువును మరింత కాలం పొడిగించాలని చాలా మంది టాక్స్ పేయర్స్ ఆదాయపన్ను శాఖను కోరుతున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమ వేదికల్లో నెటిజన్లు పదేపదే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించాలని అభ్యర్థిస్తున్నారు.
గడువు పొడిగించాలి!
ITR Last Date Extension : 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జులై 31. కానీ చాలా మంది వివిధ కారణాల చేత సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారు. దీనితో వాళ్లు 'Extend ITR Deadline' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.
సాంకేతిక సమస్యలు!
ITR filing technical error : వాస్తవానికి ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనితో చాలా మంది సదరు వెబ్సైట్లో లాగిన్ కాలేకపోయారు. మరికొందరు లాగిన్ అయినా కూడా రిటర్నులను దాఖలు చేయలేకపోయారు.
వర్షాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ కుదరలేదు!
భారతదేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారు. దీనితో వారు కూడా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు పెంచాలని అభ్యర్థిస్తున్నారు.
అధికారిక ప్రకటన రాలేదు!
ITR Filling Last Date Extension : ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నప్పటికీ.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు గురించి ఆదాయపన్ను శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
భారీ పెనాల్టీ కట్టాల్సిందే!
Belated ITR filing : జులై 31తో గడువు ముగిసినప్పటికీ.. అపరాధ రుసుము చెల్లించి, ఇప్పుడు కూడా ఐటీఆర్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.5000 పెనాల్టీ చెల్లించి.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగానూ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఈ విధంగా 2023 డిసెంబర్ 31 లోపు బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
బిలేటెడ్ ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలి?
Guide to filling belated ITR :
- ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్సైట్ www.incometax.gov.in ఓపెన్ చేయాలి.
- తరువాత 'Downloads' సెక్షన్లోకి వెళ్లాలి.
- Income Tax Returns ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత మీకు సంబంధించిన సరైన ఐటీఆర్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫారంలో మీ వ్యక్తిగత, ఆదాయ వివరాలు నింపాలి. తరువాత దానితో XML షీట్‌ని జనరేట్ చేయాలి.
- తరువాత మళ్లీ వెబ్సైట్లోకి వెళ్లి.. పాన్ కార్డు వివరాలతో లాగిన్ కావాలి.
- వెబ్‌సైట్‌లోని ఈ-ఫైలింగ్ మెనూను ఓపెన్ చేయాలి.
- తరువాత 'Income Tax Return' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- తరువాత మీరు మిమ్మల్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
- వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత.. మీరు నింపిన XML ఫారాన్ని అప్లోడ్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. మీ ఐటీఆర్ సబ్మిట్ అయిపోతుంది.