Mutual Funds For Senior Citizens : సంపాదించే ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని పొదుపు చేసుకుంటే భవిష్యత్‌లో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడొచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. మరి దీనిని ఎంత మంది పాటిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. అయితే ప్రతి ఒక్కరికీ డబ్బును పొదుపు చేయడానికి అనేక మదుపు సాధనాలు ఉన్నాయి. పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్లు ఇలా చాలానే మదుపు చేసే పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వీటిల్లో మదుపు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే వీటికి రిస్క్ ఉండదు అలాగే ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. దీంతోపాటు రాబడి సైతం స్థిరంగా అందుతుంది.
ఇదిలా ఉంటే ఎక్కువ శాతం సీనియర్ సిటిజన్లు ఈ రకమైన పథాకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీళ్లకు సంబంధించి ప్రస్తుత ఎఫ్‌డీ రేట్లు 7.50% వరకు ఉండగా.. పోస్టాఫీసు 5 ఏళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 8.20%గా ఉంది. ఈ పథకాల ద్వారా వచ్చే రాబడి ద్రవ్యోల్బణానికి దాదాపు సమానంగా లేదా కాస్త దగ్గరగా ఉంటుంది. అయితే మదుపు విషయంలో రిస్క్ తీసుకునేవారికి, ద్రవ్యోల్బణానికి మించి రాబడి సంపాదించాలనుకునే వారికి మాత్రం ఈక్విటీ మార్కెట్‌లు, మ్యూచువల్ ఫండ్ పథకాలు మంచి ఎంపిక. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మాత్రం యుక్త, మధ్యస్త వయసులో ఉన్న వారికి ఉపయోగపడతాయి. వీరితో పాటు సీనియర్ సిటిజన్లు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి..?
'మ్యూచువల్ ఫండ్' అనేది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహించే ఓ పెట్టుబడి సాధనం. ఇది ఉమ్మడి పెట్టుబడి లక్ష్యాన్ని పంచుకునే ఎందరో ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సేకరిస్తుంది. అలా పోగు చేసిన మొత్తాన్ని ఈక్విటీలు, బాండ్‌లు, మనీ మార్కెట్ సాధనాలతో పాటు ఇతర సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడుతుంది. మ్యూచువల్ ఫండ్ల కింద పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును స్టాక్‌లు, బాండ్‌లు, ఈటీఎఫ్‌లు, డిబెంచర్లు వంటి సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ రకమైన ఫండ్లపై కూడా మార్కెట్ ప్రభావం ఉంటుంది. అయినా ఇవి బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ సంపాదనను తెచ్చిపెట్టడమే కాకుండా వేగంగా మన ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు దోహదం చేస్తాయి. ఈ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (ఎస్ఐపీ) లేదా ఒకేసారి చెల్లింపుల ద్వారా కూడా మదుపు చేయొచ్చు.
సీనియర్ సిటిజన్లకు..
సీనియర్ సిటిజన్లకు తమ రిటైర్మెంట్ నిధిని సురక్షితంగా జాగ్రత్తపరచుకోవడం పెద్ద సవాలు. ఆ నిధిని ప్రభుత్వ హామీ ఉండే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే సాధారణ రాబడి మాత్రమే వస్తుంది. అందువల్ల వారు తమ నిధిలో కొంత భాగాన్ని క్రమంగా మంచి ఆదాయాన్నిచ్చే, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే పథకాలలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన పొదుపు పథకాలు ఉన్నప్పటికీ.. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టాలని అనుకునే వయోవృద్ధులకు మాత్రం మ్యూచువల్ ఫండ్లు ఓ పసందైన ఎంపిక అని చెప్పొచ్చు. కాకపోతే సీనియర్ సిటిజన్లు ఈ రకమైన ఇన్వెస్టమెంట్ ప్లాన్స్‌లో ఉండే రిస్క్‌లను కూడా అర్థం చేసుకొని ఆర్థిక నిపుణుల సూచనల మేరకు కాస్త తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి ఫలితాలు రావటం గ్యారంటీ. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులను సీనియర్ సిటిజన్లు ఓసారి తెలుసుకొని మదుపు చేస్తే మంచిది.
మ్యుచవల్ ఫండ్స్‌తో ప్రయోజనాలు:
వైవిధ్యం:
Mutual Funds Benefits And Risks : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఇది పెట్టుబడిదారుల లక్ష్యాల ఆధారంగా విభిన్న పెట్టుబడి సాధనాల్లో మీ పెట్టుబడి.. తగినన్ని ఎంపికలతో వైవిధ్యభరితంగా ఉంటుంది. వివిధ రంగాలు, ఆస్తి తరగతుల్లో పెట్టుబడులను వైవిధ్యపరచగల సామర్థ్యం ఈ ఫండ్లకు ఉంటుంది. ఇది రిస్క్‌ని తగ్గించడమే కాకుండా రాబడిని పెంచేందుకు దోహదపడుతుంది.
నిపుణుల నిర్వహణ:
వీటి ద్వారా కలిగే అతిపెద్ద ప్రయోజనం ఇదే. ఎందుకంటే పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. వీరు తగిన సమాచారంతో వివిధ పెట్టుబడి ఎంపికలను ఎంచుకుని ఇన్వెస్టర్లకు రాబడిని పెంచడంలో తమవంతు కృషి చేస్తారు.
ఫ్లెక్సిబిలిటీ:
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) లేదా ఇతర పథకాల్లా కాకుండా.. మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణలపై ఎటువంటి పరిమితులు, షరతులు ఉండవు. సీనియర్ సిటిజన్లు వారి సొంత ఉపసంహరణ ప్రణాళికలను రూపొందించుకునేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. మ్యూచువల్ ఫండ్‌లు నెలవారీగా తగిన మొత్తాలను అవసరాల మేరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశాన్నిస్తాయి.
మ్యుచవల్ ఫండ్స్‌తో ఇబ్బందులు:
ఫీజులు, కమీషన్ల రూపంలో ఖర్చులు..
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌లో లేదా సంబంధిత మ్యూచువల్ ఫండ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అయినా మ్యూచువల్ ఫండ్స్ సలహాదారుడి ద్వారా కూడా మదుపు చేయవచ్చు. దీన్నే రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులకు ఫీజుల రూపంలో కొంత కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా మన ఆదాయం కొంత మేర తగ్గుతుంది.
ఆదాయానికి నో గ్యారంటీ:
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిపై వచ్చే రాబడికే కాకుండా.. కొన్నిసార్లు ఇందులో పెట్టుబడి పెట్టిన అసలుకు కూడా హామీ ఉండదు. మార్కెట్ అస్థిరత పరిస్థితులు ఈ రకమైన ఫండ్లపై ప్రభావితం చూపుతాయి. మ్యూచువల్ ఫండ్లు మార్కెట్-లింక్డ్ కాబట్టి అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇది సీనియర్ సిటిజన్స్‌కు ప్రధాన ప్రతికూలతగా చెప్పొచ్చు.
పన్ను రాయితీలు:
సీనియర్ సిటిజన్లకు నిర్దిష్ట పన్ను రాయితీలు లేవు. ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ నిబంధనల ప్రకారం పెట్టుబడులను రిడీమ్ (ఉపసంహరణ) చేసినప్పుడు వాటిపై ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఎక్కువ కాలం వేచి ఉండాలి:
మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా పెట్టుబడి కాలం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రాబడిని ఇస్తుంటాయి. సీనియర్ సిటిజన్లకు వయసురీత్యా ఎప్పటికప్పుడు డబ్బు అవసరం పడుతూనే ఉంటుంది. అలాంటి సమయాల్లో వారు తగిన రాబడి గురించి ఎక్కువ కాలం పాటు వేచి ఉండలేరు.
ఫండ్లను అర్థం చేసుకోవడం కష్టం:
కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్లు ఒక్కోసారి యుక్త వయసులో ఉన్న మదుపరులకే కాస్త సంక్లిష్టంగా అనిపిస్తుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, రిస్క్‌లను క్లుప్తంగా అర్థం చేసుకోవడం వంటి అంశాలు సీనియర్ సిటిజన్లకు వయసురీత్యా కష్టంగా మారతాయి.
చివరగా.. సీనియర్ సిటిజన్లు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలా? వద్దా? అనేది వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితితో పాటు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అటువైపు వెళ్లేముందు సరైన ఆర్థిక సలహాదారుడితో వివరంగా మట్లాడి అన్నీ తెలుసుకొని పెట్టుబడి పెడితే మంచిది.