Unicorns In India 2022: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు పరంగా చైనాతో పోల్చితే ఎంతో ముందున్న మనదేశం మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. అంకుర సంస్థల నుంచి నూతన 'యూనికార్న్'లను సృష్టించటంలో చైనా కంటే మన దేశం ముందు నిలిచినట్లు 'హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2022' నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మనదేశం 14 నూతన యూనికార్న్‌లను ఆవిష్కరించగా, చైనా మాత్రం 11 యూనికార్న్‌లతో సరిపెట్టుకోవలసి వచ్చినట్లు ఈ నివేదిక పేర్కొంది. అమెరికా 138 యూనికార్న్‌లతో అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో అత్యధికంగా బెంగళూరు నుంచి 5 అంకుర సంస్థలు ఈ హోదా సంపాదించాయి. ఒక బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.8,000 కోట్లు) మించిన విలువ సంపాదించిన అంకుర సంస్థలను 'యూనికార్న్'లని వ్యవహరిస్తున్న సంగతి విదితమే. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రపంచ వ్యాప్తంగా 254 అంకుర సంస్థలు ఈ హోదా అందుకున్నాయి.
విదేశాల్లోనూ స్థాపించారు..
మనదేశంలో ప్రస్తుతం 68 యూనికార్న్‌లు ఉన్నాయి. దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువతో బైజూస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో స్విగ్గీ (11 బిలియన్ డాలర్లు), డ్రీమ్11 (8 బిలియన్ డాలర్లు).. తదితర సంస్థలు ఉన్నట్లు హురున్ నివేదిక విశ్లేషించింది. మనదేశానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు మనదేశం వెలుపల పలు దేశాల్లో స్థాపించిన అంకుర సంస్థల్లో 56 సంస్థలు సైతం ఈ హోదా సంపాదించడం ఆసక్తికరమైన విషయం. ఇందులో 51 సంస్థలు యూఎస్‌లో ఉండగా.. యూకేలో 2, జర్మనీ, సింగపూర్, మెక్సికో దేశాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
నగరాల్లో ఇవీ..: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం, 'ప్రపంచ యూనికార్న్ సంస్థల రాజధాని' గా తన గుర్తింపును కొనసాగిస్తోంది. ఈ నగరంలో 176 'యూనికార్న్' అంకుర సంస్థలు ఉన్నాయి. 120 యూనికార్న్ సంస్థలతో రెండో స్థానంలో న్యూయార్క్ నగరం నిలిచింది. బీజింగ్ మూడో స్థానంలో ఉంది. బీజింగ్‌లో 35 యూనికార్న్ అంకుర సంస్థలు ఉన్నాయి. తదుపరి స్థానాల్లో షాంఘై, లండన్ ఉన్నాయి.
6 నెలల్లో విలువ తగ్గింది..
విలువ పరంగా చూస్తే, మనదేశానికి చెందిన బైజూస్ 14వ స్థానంలో కనిపిస్తోంది. స్విగ్గీ 45వ స్థానంలో, డ్రీమ్11 సంస్థ 75వ స్థానంలో, ఓయో 91వ స్థానంలో నిలిచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంకుర సంస్థల విలువలు బాగా క్షీణించాయి. దీనివల్ల కొన్ని సంస్థలు తమ యూనికార్న్ హోదాను కోల్పోయాయి. గత ఆరు నెలల కాలంలో దాదాపు 147 యూనికార్న్ సంస్థల విలువ తగ్గిపోయినట్లు, ఇందులో యూఎస్‌కు చెందిన 71 సంస్థలు, చైనాలోని 29 సంస్థలు ఉన్నట్లు హురున్ నివేదిక పేర్కొంది. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న డౌయిన్ అనే అంకుర సంస్థ విలువ ఎంతో అధికంగా 200 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. స్వీడన్‌కు చెందిన క్లార్నా అనే సంస్థ విలువ 86 శాతం క్షీణించింది.
ఈ సంస్థలు పెట్టుబడులు పెడితే..
యూనికార్న్ హోదా సాధించిన అంకుర సంస్థల్లో అధికంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ అయిన సీఖోయా కేపిటల్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ సంస్థ పెట్టుబడులు పెట్టిన అంకుర సంస్థల్లో, 234 సంస్థలకు యూనికార్న్ హోదా దక్కింది. తద్వారా ఎంతో విజయవంతమైన పెట్టుబడుల సంస్థగా దీనికి గుర్తింపు లభించింది. రెండో స్థానంలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఉంది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన అంకుర సంస్థల్లో, 180 సంస్థలు యూనికార్న్ హోదా సంపాదించాయి. టైగర్ గ్లోబల్ మూడో స్థానంలో ఉంది.
ఇవీ చదవండి: ఒక్క మీమ్‌తో కొత్త ఐఫోన్ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు