Ajay Banga World Bank President : ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా అజయ్ బంగా బుధవారం నియమితులయ్యారు. దీంతో ప్రపంచబ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న భారత సంతతికి చెందిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన ఈ ఏడాది జూన్ 2 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు వరల్డ్ బ్యాంక్ ధ్రువీకరించింది. ఈ పదవిలో ఆయన 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని 25 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించిన అనంతరం వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
కీలక హోదాల్లో మనవాళ్లే!
189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్, చీఫ్ ఎకానమిస్ట్‌గా ఇందర్‌మిత్ గిల్, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్ సుందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పరమేశ్వరన్ అయ్యర్ కొనసాగుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.
అంతకుముందు ఫిబ్రవరిలోనే 63 ఏళ్ల బంగాను వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బంగా ఇప్పటివరకు మాస్టర్ కార్డ్, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల్లో అత్యున్నత హోదాల్లో సేవలందించారు. 2016లో పద్మశ్రీ అవార్డు పొందిన బంగా.. ఇటీవల జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. గతంలో దాదాపు 24,000 మంది ఉద్యోగులు కలిగిన మాస్టర్ కార్డ్‌కు ప్రెసిడెంట్‌గా, సీఈఓగానూ పని చేశారు అజయ్ బంగా. ఆర్థిక నిపుణుడిగా అజయ్ బంగాకు మంచి గుర్తింపు ఉంది.
"అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న కష్టతరమైన అభివృద్ధి సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌నకు సంబంధించి అన్ని ఆశయాలు, ప్రయత్నాలపై అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి బోర్డు ఎదురుచూస్తోంది."
- వరల్డ్ బ్యాంక్
బంగాకు కమలా హారిస్ విషెస్!
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అజయ్ బంగాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. "ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అజయ్ బంగాకు అభినందనలు. అమెరికా అభివృద్ధిలో అజయ్ అద్భుతమైన పనితీరుతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను" అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు.