iShield insurance : జీవిత, ఆరోగ్య బీమా పథకాలు రెండింటినీ కలిపి ఒకే పాలసీగా ఇచ్చే 'ఐషీల్డ్ బీమా పథకం' మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లు సంయుక్తంగా ఈ టూ ఇన్ ఒన్ బీమా పాలసీని.. 'ఐషీల్డ్' పేరుతో తీసుకొచ్చాయి.
ఈ ఐషీల్డ్ బీమా పథకం ద్వారా.. వైద్య చికిత్సలకు అవసరమైన ఖర్చులను చెల్లించడం సహా, పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి పరిహారాన్ని కూడా చెల్లిస్తారు.
ఐషీల్డ్ ఆరోగ్య బీమా ప్రయోజనాలు
iShield health benefits : ఈ ఐషీల్డ్ బీమా పథకం ద్వారా రోజువారీ వైద్య చికిత్స ఖర్చులతో సహా, ఆసుపత్రిలో చేరక ముందు, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తరువాత కూడా చికిత్స ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది. అంటే ఇన్ పేషెంట్‌గా ఉన్నప్పుడు మాత్రమే కాదు. అవుట్ పేషెంట్‌గా ఉన్న సమయంలోనూ చికిత్సకు అయ్యే ఖర్చులు భరిస్తుంది. అంతే కాదు హోమ్ కేర్ ట్రీట్మెంట్ అంటే ఇంటిలోనే ఉంటూ తీసుకునే వైద్యానికి కూడా పరిహారం అందిస్తుంది. ఇది పాలసీదారులకు ఆర్థికంగా ఎంతో చేయూత నిచ్చే అవకాశం ఉంది.
ఐషీల్డ్ జీవిత బీమా ప్రయోజనాలు
iShield life insurance benefits : ఐషీల్డ్ పథకంలో జీవిత బీమా రక్షణ 85 ఏళ్ల వరకు కొనసాగుతుంది. అంటే పాలసీదారుడు ఉన్నంత కాలం ఆరోగ్య బీమా లభిస్తుంది. మరణించిన తరువాత అతని లేదా ఆమె నామినీకి జీవిత బీమా పరిహారం లభిస్తుంది.
ఒకే పాలసీ - రెండు లాభాలు
ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఈ సరికొత్త ఐషీల్డ్ పాలసీని రూపొందించినట్లు ఈ బీమా సంస్థలు వెల్లడించాయి. దీని ద్వారా పాలసీదారులు జీవిత బీమా, ఆరోగ్య బీమా కోసం రెండు వేర్వేరు పాలసీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నాయి.
ఐషీల్డ్ పాలసీని తీసుకోవడం ఎలా?
How to get iShield Policy : ఆసక్తిగల వారు ఐషీల్డ్ బీమా పథకం దరఖాస్తు పత్రాన్ని పూర్తిగా నింపాలి. తరువాత నిర్దేశిత వైద్యశాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వైద్య నివేదికను పరిశీలించి, అర్హులకు పాలసీలను అందజేస్తారు.
పాలసీ తీసుకునే మార్గాలు
How to buy iShield Policy : ఐషీల్డ్ పాలసీని.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఈ బీమా సంస్థకు చెందిన యాప్ లేదా ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసీని తీసుకునేందుకు వెసులుబాటు ఉంది.