బంగారం కొనేవారికి అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి పలు బంగారానికి సంబంధించి కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. బంగారంపై మరో ధ్రువీకరణ మార్క్ కనిపించనుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై ఆరు డిజిట్ల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి కానుంది. ఆల్ఫాన్యూమరిక్ HUID ఐడీ లేని ఆభరణాల విక్రయానికి ఏప్రిల్ 1 వరకు గడువు ఉండగా.. దీన్ని పొడగించే ఉద్దేశం తమకు లేదని బీఐఎస్ చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ స్పష్టం చేశారు. పాత స్టాక్‌ను విక్రయించేందుకు ఆభరణ తయారీదారులకు రెండేళ్ల సమయం ఇచ్చామని, మరింత పొడగింపు చేసే ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏంటి? HUID కోడ్ ఎలా గుర్తించాలి అనే వివరాలు తెలుసుకుందాం..
గోల్డ్ హాల్‌మార్క్ అనేది బంగారం స్వచ్ఛతకు ఇచ్చే ధ్రువీకరణ. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉందనే విషయాన్ని ఆ ఆభరణంపై కోడ్ రూపంలో ముద్రిస్తారు. 2021 జూన్ 16 వరకు ఈ పద్ధతిని స్వచ్ఛందంగా అమలు చేశారు. ఆభరణ తయారీదారులు తమ ఇష్టపూర్వకంగా హాల్‌మార్క్ వేసేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు. ఈ విధానం విజయవంతంగా అమలైందని కేంద్రం వెల్లడించింది. స్వల్ప కాలంలోనే రెండు కోట్లకు పైగా బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ముద్ర పడిందని తెలిపింది. లక్షకు పైగా స్వర్ణకారులు దీనికి రిజిస్టర్ అయ్యారని, రోజుకు మూడు లక్షలకు పైగా ఆభరణాలు హాల్ మార్క్ ధ్రువీకరణ పొందుతున్నాయని వివరించింది.
హాల్‌మార్క్ గుర్తులు ఇవే..
హాల్‌మార్క్ వేసిన ఆభరణాలపై ఇదివరకు బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత (ఉదా. 22క్యారెట్లు916), జ్యువెలరీ లోగో, హాల్‌మార్క్ సెంటర్ వివరాలను ముద్రించేవారు. ఆరు డిజిట్ల HUID కోడ్ ఉండేది కాదు. ఇటీవల HUID కోడ్‌ను ఆభరణాలపై ముద్రించాలని నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం.. బంగారంపై ఇక నుంచి మూడు గుర్తులే కనిపిస్తాయి. బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు డిజిట్ల HUID కోడ్ మాత్రమే ఆభరణాలపై ఉండేలా చూస్తారు.
HUIDతో లాభం ఏంటి?
HUID అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేక కోడ్ కేటాయిస్తుంది. బంగారం స్వచ్ఛత, హాల్‌మార్కింగ్‌పై కస్టమర్లు ఏవైనా ఫిర్యాదులు లేవనెత్తితే.. పరిష్కరించేందుకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది. HUID ఆధారిత హాల్‌మార్కింగ్, స్వర్ణకారుల రిజిస్ట్రేషన్.. మానవప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎలాంటి అవకతవకలకు తావుండదు. పారదర్శకత పెరగడం సహా, వినియోగదారుల హక్కులకు రక్షణ ఉంటుంది.
బంగారం స్వచ్ఛత ఎలా కొలుస్తారు?
బంగారం ఎంత స్వచ్ఛంగా ఉందనేది క్యారెట్లలో సూచిస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది. మృదువుగా ఉండే ఈ బంగారం.. బిస్కెట్లు, కడ్డీల రూపంలో కనిపిస్తుంటుంది. ఇంత స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు తయారు చేయడానికి వీలు పడదు. అందుకే వాటిలో ఇతర లోహాలను కలుపుతారు. అలా.. ఆభరణాలకు అనువైన 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని తయారు చేస్తారు. 14 క్యారెట్ అంటే 58.5 శాతం స్వచ్ఛమైన బంగారం అని అర్థం. హాల్‌మార్క్‌లో దీని స్వచ్ఛతను 14K585 గా సూచిస్తారు. 22 క్యారెట్ల బంగారం 91.6శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. దీని హాల్‌మార్క్ కోడ్ '22కే750'.