ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ఫోన్లకు లాక్ వేస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే తాజా అధ్యయనం ఒకటి... స్మార్ట్ ఫోన్‌కు వేసే లాక్ విధానంతో వారి వయసు అంచనా వేయొచ్చని తేల్చింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం ప్రకారం స్మార్ట్‌ఫోన్ వాడే వయోవృద్ధులు ఎక్కువ శాతం ఆటోమేటిక్ లాక్ వైపే మొగ్గు చూపుతున్నారట. అలానే ఫింగర్‌ప్రింట్ లాక్లనూ వినియోగిస్తారని నివేదికలో పేర్కొంది. ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో, ఇంట్లో ఉండేటప్పుడే మాత్రమే వారు చరవాణులను అన్‌లాక్ చేస్తారట. అలానే యువత కంటే వీరి ఫోన్ వినియోగ సమయం చాలా తక్కువని పరిశోధకులు తెలిపారు.
అధ్యయనం ఎలా..?
19 నుంచి 63 ఏళ్ల వయసు కలిగిన 134 మందిపై ఈ అధ్యయనం చేశారు. 2 నెలల పాటు వీరి చరవాణుల్లో ప్రత్యేక యాప్‌ను ఇన్స్టాల్ చేసి లాక్, అన్‌లాక్ విషయాల వివరాలు, ఆటో, మాన్యువల్ లాక్ ఎంపిక వంటి వివరాలను సేకరించారు. అధ్యయనంలో ముఖ్యాంశాలు..
⦁ 25 ఏళ్ల వయసు కలిగిన వారు రోజులో సుమారు 20 సార్లు వారి ఫోన్ వినియోగిస్తారు.
⦁ 35 ఏళ్ల వయసు వారు సుమారు 15 సార్లే వారి చరవాణి వాడతారట.
⦁ మహిళల కంటే పురుషులు ఎక్కువ మంది ఆటోలాక్ ఇష్టపడతారట.
⦁ 20వ పడిలో ఉన్న అమ్మాయిలు.. వారి వయసు అబ్బాయిల కన్నా ఎక్కువ సమయం చరవాణి వినియోగిస్తారని అధ్యయనం తెలిపింది.
⦁ 50లలో ఉన్న వారిలో మహిళల కన్నా పురుషులే అత్యధికంగా ఫోన్ వినియోగిస్తున్నట్లు తేలింది.
స్మార్ట్ఫోన్లను తయారు చేసే సంస్థలకు ఈ నివేదిక ఉపకరిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ వివరాల ద్వారా ఆయా వయస్కుల వారికి అనుగుణంగా కొత్త స్మార్ట్ ఫోన్లు తయారు చేయవచ్చన్నారు.
- ఇదీ చూడండి: అంకురాలకు వాట్సాప్ ఆర్థిక ప్రోత్సాహం