How To Choose Best Health Insurance Policy : కరోనా భయాలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఆరోగ్య బీమా కాపాడుతుంది. మనం ఆర్థికంగా చితికిపోకుండా రక్షణ కల్పిస్తుంది. అందుకే అవసరం వచ్చినప్పుడు చూద్దాం అనుకోకుండా, కచ్చితంగా వీలైనంత తొందరగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం మంచిది.
నిబంధనలు మారవచ్చు!
మనం ఆరోగ్యంగానే ఉన్నాం కదా! ఇప్పుడు ఈ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం అవసరమా? అనే భావనలో చాలామంది ఉంటారు. వాస్తవానికి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాలి. ఎందుకంటే, అనారోగ్యం బారిన పడిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కష్టమవుతుంది. పైగా నిబంధనలు, మినహాయింపులు అన్నీ మారిపోతాయి. ఒక వేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చినా అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
బోలెడు ప్రయోజనాలు!
Health Insurance Benefits : అనుకోని ప్రమాదాలు, అనారోగ్యాలు ఏర్పడినప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆరోగ్య బీమా పాలసీ ఆదుకుంటుంది. అందువల్ల వీలైనంత వరకు చిన్న వయస్సులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. చిన్న వయస్సులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియానికే ఆరోగ్య బీమా పాలసీ లభిస్తుంది.
ఇది దండగ ఖర్చు కాదు!
ఆరోగ్య బీమా తీసుకుని ఆసుపత్రిలో చేరకపోతే, ప్రీమియం దండగ అవుతుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే, నేటి కాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకసారి హెల్త్ ప్రోబ్లమ్ వచ్చిందంటే, జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా ఖర్చు అయిపోతోంది. అందుకే ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ ఉండడం తప్పనిసరి.
రెన్యూవల్ తప్పనిసరి!
Health Insurance Policy Renewal : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, దానిని క్రమం తప్పకుండా పునరుద్ధరణ చేసుకోవాలి. అప్పుడే బీమా సంస్థలు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా పరిహారాన్ని అందిస్తాయి.
కవరేజ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి!
తక్కువ ప్రీమియంతో లభించే పాలసీలు అన్ని వేళలా మన అవసరాలకు సరిపోకపోవచ్చు. కనుక, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న వివిధ సంస్థల పాలసీలను పోల్చి చూసుకోవాలి. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయా పాలసీలు ఏ విధంగా, పరిహారం అందిస్తాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా సహ చెల్లింపులు, ఉప పరిమితులు లాంటి వాటిని కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి.
మొదటి రోజు నుంచే బీమా రక్షణ!
Health Insurance Policy Waiting Period : సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే బీమా రక్షణ ప్రారంభం అవుతుంది. కొన్ని చికిత్సలకు 30 రోజుల తర్వాతే ఈ కవరేజ్ వర్తిస్తుంది. కొన్ని వ్యాధుల చికిత్సలకు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కరోనా చికిత్స విషయానికి వస్తే, పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాతే బీమా సంస్థలు కొవిడ్-19 చికిత్సకు పరిహారం అందిస్తాయి.
బృంద పాలసీ ఉన్నప్పటికీ!
Health Insurance Group Policy : సాధారణంగా ఉద్యోగులకు వారి యాజమాన్యం బృంద పాలసీ ఇస్తుంది. బృంద బీమా పాలసీల్లో తల్లిదండ్రులకు కూడా రక్షణ లభిస్తుంది. ఈ పాలసీల్లో వేచి ఉండే వ్యవధి లాంటి నిబంధనలు సాధారణంగా ఉండవు. అయితే చాలా మంది ఈ బృంద బీమా పాలసీ ఉంది కదా! మళ్లీ ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎందుకు? అని అనుకుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడు మాత్రమే ఈ బృంద బీమా పాలసీ రక్షణ ఉంటుంది. ఆ తరువాత ఉండదు. కనుక ఉద్యోగం మారే ఆలోచన ఉన్నవారు, సొంతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం ఎంతైనా మంచిది.
క్లెయిమ్ తిరస్కరించకుండా ఉండాలంటే?
How To Claim Health Insurance : ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు మీ హెల్త్ హిస్టరీ గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ఇలా అన్ని ఆరోగ్య సమస్యలు గురించి చెబితే, బీమా పాలసీ ఇవ్వరని, ఒక వేళ ఇచ్చినా అధిక ప్రీమియం వసూలు చేస్తారని అనుకోవద్దు. ఎందుకంటే, మన ఆరోగ్య వివరాలు దాచిపెట్టి పాలసీ తీసుకుంటే, తర్వాత లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కనుక ధూమపానం, మత్తుపానీయాలు సేవించడం, వంశపారంపర్య వ్యాధులు, ఇంతకు ముందే వచ్చిన అనారోగ్య సమస్యలు మొదలైనవాటి పూర్తి సమాచారాన్ని ముందుగానే మనం బీమా సంస్థలకు తెలియజేయాలి.
24 గంటల్లోగా
బీమా కంపెనీకి నిర్ణీత వ్యవధిలోగా సమాచారం ఇవ్వకపోతే మీ క్లెయింను తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. కనుక ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి అన్ని వివరాలు తెలియజేయాలి. ఒకవేళ పాలసీదారుడు వివరాలు తెలియజేసే స్థితిలో లేకపోతే, అతను/ ఆమెకు బదులుగా నామినీ లేదా అధీకృత వ్యక్తులు సదరు బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
నియమ, నిబంధనలు తెలుసుకోవాలి!
Health Insurance Rules And Regulations In India : హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకునేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని నియమ, నిబంధనలు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పాలసీ పత్రంలోని అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ప్రతి ఆరోగ్య బీమా పాలసీలో ఎలాంటి పరిస్థితుల్లో బీమా వర్తించదో కూడా కచ్చితంగా రాసి ఉంటారు. కనుక ఆ విషయాలను కూడా కచ్చితంగా పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిహారం పొందడానికి వీలవుతుంది.
డిసెంబర్ డెడ్‌లైన్స్ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్ చేయాల్సిందే!
కొత్త బైక్ కొనాలా? రూ.61 వేల నుంచి రూ.1.60 లక్షల రేంజ్‌లోని టాప్-10 టూ-వీలర్స్ ఇవే!