Blue Aadhaar Card : దేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు.. ఇలా ఎక్కడ ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. అందుకే దీన్ని దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తాం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికీ 12 అంకెల సంఖ్యతో పూర్తి పేరు, పుట్టిన తేదీ, శాశ్వత చిరునామా వంటి ప్రాథమిక వివరాలతో ఈ ఆధార్ కార్డును జారీ చేస్తోంది. అయితే మనమంతా ఆధార్ కార్డులు సాధారణంగా తెలుపురంగులో ఉండడం చూసి ఉంటాం. కానీ, యూఐడీఏఐ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా బ్లూ కలర్లో ఉండే ఆధార్ కార్డులను జారీ చేస్తోంది. అసలు బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి ? ఎవరికిస్తారు.. దాని కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Blue Aadhaar Apply Procedure : యూఐడీఏఐ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా బ్లూ ఆధార్ కార్డులను జారీ చేస్తోంది. వీటినే బాల్ ఆధార్ కార్డులుగా పిలుస్తారు. 5 సంవత్సరాలలోపు పిల్లల కోసం జారీ చేసే ఈ కార్డులలో ఆధార్ నంబర్‌ను బ్లూ కలర్లో ప్రింట్ చేస్తారు. కాబట్టే వీటిని బ్లూ ఆధార్ కార్డులు(Blue Adhaar Card)గా వ్యవహారిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండానే ఈ కార్డు అందజేస్తారు. కేవలం పేరు, తల్లిదండ్రుల పేరు, చిరునామా, ఒక ఫొటో వంటి ప్రాథమిక సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది. వీరికిచ్చే బ్లూ ఆధార్ కార్డుని తల్లిదండ్రుల ఆధార్ నంబర్(Aadhaar Number)తో అనుసంధానిస్తారు. చిన్నారుల బ్లూ ఆధార్ కార్డు కూడా 12 అంకెలతో జారీ చేస్తారు.
Baal Aadhaar Card Details : ఈ బ్లూ ఆధార్ కార్డు కాలపరిమితి ఆ చిన్నారులకు ఐదేళ్ల వయస్సు వరకే ఉంటుంది. ఆ తర్వాత వారి వేలి ముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలను అందజేసి ఈ ఆధార్‌కార్డుని అప్డేట్ చేసుకోవాలి. లేదంటే చిన్నారులకు ఇచ్చిన బ్లూ ఆధార్ కార్డు చెల్లదు. 15 సంవత్సరాలు నిండిన తర్వాత మరోసారి చిన్నారుల ఈ ఆధార్ కార్డుని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు నవజాత శిశువుల కోసం ఈ బ్లూ ఆధార్ లేదా బాల్ ఆధార్(Baal Aadhaar Card)కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Required Documents for Blue Aadhaar Card :
బ్లూ ఆధార్ అప్లై కోసం అవసరమైన పత్రాలు :
- ప్లిలల జనన ధ్రువీకరణ పత్రం లేదా
- చిన్నారుల పాఠశాల ఐడెంటిటీ కార్డు
- తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు
- పిల్లలకిచ్చే ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో లింక్ అయ్యి ఉంటుంది.
How to Apply For Blue Aadhaar Card in Telugu :
బ్లూ ఆధార్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లాలి.
- ఆ తర్వాత ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో పిల్లల పేరు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి ఫోన్ నంబర్, పిల్లవాడు, సంరక్షకుడు/తల్లిదండ్రులకు సంబంధించిన ఇతర బయోమెట్రిక్ డేటాతో పాటు అవసరమైన సమాచారాన్ని తల్లిదండ్రులు అందించాలి.
- ఆపై మీ ఇంటి అడ్రస్, కమ్యూనిటీ, రాష్ట్రం లాంటి డెమోగ్రాఫిక్ సమాచారాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
- అక్కడ అడిగిన పూర్తి సమాచారాన్ని మీరు సబ్మిట్ చేయాలి.
- అనంతరం ఆధార్ కార్డు కోసం రిజిస్టర్ చేసుకోవడానికి 'Appointment' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీకు దగ్గరలోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో అపాయింట్మెంట్ తీసుకోవాలి.
- అక్కడికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు, చిరునామా, పుట్టిన తేదీ, రిఫరెన్స్ నంబర్‌తో సహా అన్ని అవసరమైన డాక్యుమెంట్లను మీతో తీసుకెళ్లాలి.
- ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆధార్ కేంద్రం వారు ఒక రసీదు సంఖ్యను మీకు అందిస్తారు. దాని ద్వారా మీ అప్లై చేసుకున్న బ్లూ ఆధార్ కార్డును స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
UIDAI Warning : ఆధార్ యూజర్స్‌కు వార్నింగ్.. వాట్సాప్‌లో అలా చేస్తే..
PVC Aadhar Card Apply : 'ఆధార్' పోయిందా? PVC కార్డ్ కోసం అప్లై చేసుకోండిలా..
ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తెలియదా?.. చెక్ చేసుకోండిలా!