షేర్ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా క్షీణించింది. ఆయన తన సంపదలో సుమారు 60 శాతం మేర కోల్పోయారు. అదానీ గతేడాదిలో ప్రతి వారం సుమారు రూ. 3,000 కోట్లు నష్టపోయారని M3M 'హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్' నివేదించింది. ఫలితంగా మార్చి మధ్యలో వరకు అదానీ ఆస్తిని 53 బిలియన్ డాలర్లు నిర్ధరించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు.
అదానీతో పాటు అంబానీ సంపద విలువ కూడా పడిపోయింది. ప్రపంచ కుబేరులు జాబితాలో అదానీ 11 స్థానాలు పడిపోయి 23వ స్థానం వద్ద ఉన్నారు. అంబానీ 9 వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే గత 10 ఏళ్లలో వీరి వ్యాపారాన్ని పరిశీలిస్తే.. భారీగా లాభపడ్డారు. అదానీ సంపద 1,225 శాతం పెరగగా.. అంబానీ సంపద 356 శాతం మేర ఎగబాకిందని 'హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్' ఓ నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 187 డాలర్ల బిలియనీర్లు నివసిస్తున్నారని.. గతేడాదితో పోల్చితే ఇది 15 శాతం అధికమని చెప్పింది. ఈ సంపన్నుల్లో 66 మంది దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనే నివసిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను పరిశీలిస్తే.. వీరిలో 217 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ఆదాయంలో భారత్ 5 శాతాన్ని ఆక్రమించింది. అమెరికా 32 శాతం, చైనా 25 శాతంగా ఉంది.
సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా 27 బిలియన్ డాలర్లతో వైద్యరంగంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఏషియన్ పెయింట్స్ యజమాని అయిన అశ్విన్ దానీ కుటుంబం 7.1 బిలియన్ డాలర్లతో ఆ రంగంలో.. బైజు రవీంద్రన్ 3.3 బిలియన్ డాలర్లతో విద్యారంగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. మరోవైపు భారత్‌లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారని.. వారిలో రాధా వేంబు 4 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇదీ జరిగింది..
దేశీయ స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. అమెరికా న్యూయార్క్‌కు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ జనవరి 24న ఓ నివేదికను విడుదల చేసింది. ఫలితంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఎదురుదాడికి దిగిన అదానీ గ్రూప్.. హిండెన్‌బర్గ్ సంస్థపై ప్రతి ఆరోపణలు చేసింది. కావాలనే తమను దెబ్బకొట్టానికే చేశారని ఆరోపిస్తూ.. హిండెన్‌బర్గ్ సంస్థను 'అనైతిక షార్ట్ సెల్లర్'గా అభివర్ణించింది. ఆ నివేదకలో చేసిన ఆరోపణలన్నీ అబద్దాలే అని తిప్పికొట్టింది. వారి నివేదికకు ప్రతిగా జనవరి 29న 413 పేజీల రిపోర్టును అదానీ గ్రూప్ వెలువరించింది. అందులో 'ఇది అదానీ గ్రూప్‌పై కాదు.. ఇండియాపై దాడి'గా అభివర్ణించింది. దీనిపై స్పందించిన హిండెన్‌బర్గ్.. దేశం ముసుగులో తప్పించుకోలేరని హితవు పలికింది.
ఇవీ చదవండి : అమెజాన్ ఉద్యోగులకు మరోసారి షాక్.. 9,000 మందికి ఉద్వాసన
ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. మరో 10 రోజులే ఛాన్స్.. తర్వాత కొందామన్నా దొరకవ్!!