Health Insurance Portability : మీరు తీసుకున్న ఆరోగ్య బీమాను.. మరో పాలసీతో పోల్చినప్పుడు.. మీవద్ద ఉన్న పాలసీ పెద్దగా లాభం లేదని అనిపించవచ్చు. ఎక్కువ ప్రీమయం వసూలు చేస్తూ.. మెరుగైన సేవలు అందించడం లేదని భావించవచ్చు. ఇలాంటప్పుడు.. మీరు మరో ఇన్సూరెన్స్ సంస్థలోకి మారిపోవచ్చని మీకు తెలుసా? మొబైల్ నంబర్‌ను ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసుకున్నట్లే.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా బదిలీ చేసుకోవచ్చు! అయితే.. పోర్టబిలిటీ సమయంలో పలు విషయాలను పరిశీలించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోర్ట్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
పాలసీ రకం : పోర్టబిలిటీ సెలక్ట్ చేసుకునేటప్పుడు.. మీకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలను ఓ సారి పరిశీలించాలి. మీ వ్యక్తిగత పాలసీలో కుటుంబ సభ్యులను యాడ్ చేయాలనుకుంటే.. ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా బహుళ-వ్యక్తిగత పాలసీలు ఎంచుకోవచ్చు.
వెయిటింగ్ పీరియడ్ : మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసేటప్పుడు ఇది చాలా కీలకం. ప్రస్తుత పాలసీలో మీరు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ పూర్తిచేసుకున్నట్లయితే.. కొత్త పాలసీలో దీన్ని పరిగణించాలి. అలా చేయడం ద్వారా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడినప్పుడు బీమా కవరేజీ కోల్పోకుండా ఉంటారు.
యాడ్-ఆన్ ఫీచర్స్ : మీరు తీసుకునే కొత్త పాలసీలో నో క్లెయిమ్ బోనస్ రివార్డు, ఆసుపత్రిలో వినియోగించే వస్తువుల కవరేజీ, బీమా మొత్తాన్ని పెంచడం వంటి యాడ్-ఆన్ ఫీచర్స్ ఉన్నాయేమో చూడాలి. మీ ప్రస్తుత పాలసీని ఇవి మరింత లాభదాయకంగా చేస్తాయి. అయితే.. ఈ యాడ్-ఆన్స్ కోసం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే మీరు వీటిని సెలక్ట్ చేసుకొని ఉంటే.. పోర్టింగ్ చేసుకునే పాలసీలో కూడా యాడ్ అయ్యేలా చూసుకోవాలి.
What Is Top Up Health Insurance Policy : హెల్త్ ఇన్సూరెన్స్ టాపప్‌తో మరింత ధీమా.. ఈ లాభాలు తెలుసా?
పోర్టింగ్ డాక్యుమెంటేషన్ : మీ పోర్టింగ్ గురించి ప్రస్తుత ఇన్సూరెన్స్ సంస్థకు ముందుగానే తెలియజేయాలి. బీమా మొత్తం, కవరేజీలో ఉన్న సభ్యులు, నో-క్లెయిమ్ బోనస్ మొదలైన వివరాలను పోర్ట్ చేసుకునే సంస్థకు తెలపాలి. అదేవిధంగా.. గత 2 సంవత్సరాల పాలసీలు, ఇప్పటికే ఉన్న పాలసీల క్లెయిమ్ వివరాలు, పోర్ట్ చేయాల్సిన పాలసీ రకం.. వంటి వివరాలు కూడా సమర్పించాలి.
పోర్టబిలిటీ ఏ సమయంలో చేయాలి? : మీ పాలసీ రెన్యూవల్ సమయంలో మాత్రమే పోర్టబిలిటీ సాధ్యమవుతుంది. రెన్యూవల్‌కు 45 రోజుల ముందే పోర్టింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఎందుకంటే.. ఏవైనా కారణాల వల్ల పోర్టింగ్‌ను కొత్త బీమా కంపెనీ అంగీకరించకపోతే, ప్రస్తుత బీమా కంపెనీలోనే కొనసాగే ఛాన్స్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్‌లో పోర్టబిలిటీకి ఆమోదం ఉండదు.
ప్రీమియం మాత్రమే చూడకూడదు : పాలసీ పోర్ట్ చేసేటప్పుడు చాలా మంది ప్రీమియం మాత్రమే చూస్తారు. ఎల్లప్పుడూ తక్కువ ప్రీమియం మాత్రమే మంచి సెలక్షన్ కాదు. మీ ఆరోగ్య సంరక్షణ కోసం మీకు అవసరమైన అన్ని కవరేజీలు, ఫీచర్లు, ఇతర ప్రయోజనాలను కొత్త బీమా సంస్థ అందిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే అత్యవసర పరిస్థితిలో చేతి నుంచి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావొచ్చు.