GST On Milk Curd Daily Food Items: పెట్రోల్, డీజిల్ సహా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. జూన్ 28, 29న చండీగఢ్‌లో జరిగిన జీఎస్టీ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 18 నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్ తదితరాలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఆయా వస్తువులపై ఇంతకుముందు ఇన్‌పుట్ టాక్స్ ప్రయోజనం ఉండగా, ఇప్పుడు తొలగించనున్నారు. ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై కూడా ఇన్‌పుట్ టాక్స్ ప్రయోజనం దూరం కానుండటం వల్ల వాటి ధరలు పెరగనున్నాయి.
చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఫీజుపై జీఎస్టీ 18శాతానికి పెరగనుంది. ఎల్‌ఈడీ లైట్లు, ల్యాంపులపై ఇప్పటివరకు విధిస్తున్న 12శాతం జీఎస్టీ.. ఇప్పుడు 18శాతానికి చేరనుంది. ఐసీయూలు మినహా ఆసుపత్రుల్లో 5వేల రూపాయలకు మించిన గది అద్దెపై ఇప్పటివరకు పన్ను మినహాయింపు ఉండగా.. ఇప్పుడు 5శాతం జీఎస్టీ విధించనున్నారు. రోజుకు వెయ్యిలోపు ఉండే హోటల్ గది అద్దెపై కూడా 12 శాతం పన్ను వసూలు చేయనున్నారు. అయితే కొత్త పన్ను రేట్లభారం వినియోగదారులపై పడటానికి కాస్త సమయం పట్టొచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇవీ చదవండి: పెరిగిన విదేశీ డిపాజిట్ రేట్లు.. రూపాయి పతనానికి చెక్ పెట్టే దిశగా..