Shipping Corporation Of India: అప్రధానేతర (నాన్-కోర్) ఆస్తుల విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత, సెప్టెంబరు నాటికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) విక్రయానికి ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించారు. వ్యూహాత్మక విక్రయ ప్రక్రియలో భాగంగా షిప్పింగ్ హౌస్, పుణెలోని శిక్షణా సంస్థ, ఎస్‌సీఐకి చెందిన కొన్ని నాన్-కోర్ ఆస్తులను ప్రభుత్వం తొలగిస్తోందని, దీనికి సమయం పడుతుందని తెలిపారు. 3-4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తామని సదరు అధికారి పేర్కొన్నారు.
గత వారంలో షిప్పింగ్ కార్పొరేషన్ బోర్డు సమావేశమై, నవీకరించిన విభజన పథకానికి (అప్‌డేటెడ్ డీమెర్జర్ స్కీమ్) ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం, ఎస్‌సీఐకి చెందిన అప్రధానేతర ఆస్తుల్ని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్‌కు (ఎస్‌సీఐఎల్‌ఏఎల్) బదిలీ చేయనుంది. ఇందులో షిప్పింగ్ హౌస్, ముంబయి అండ్ ఎమ్‌టీఐ (మారిటైమ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) తదితర ఆస్తులు కూడా ఉన్నాయి. వీటిని విభజించి ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌కు బదిలీ చేసిన తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక విక్రయ ప్రక్రియ మొదలు కానుంది. 2022 మార్చి 31 నాటికి విభజన పథకం కింద ఎస్‌సీఐకు ఉన్న అప్రధానేతర ఆస్తుల విలువ సుమారు రూ.2,392 కోట్లుగా ఉంది. ఎస్‌సీఐ ప్రైవేటీకరణను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.
ఇదీ చదవండి: సెంచరీ కొట్టినా 'లాభం' లేదు.. అధిక వ్యయాలే కారణమా?