crude oil news: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురును భారత రిఫైనరీ సంస్థల్లో వేటికైనా విక్రయించేందుకు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, వేదాంతా లాంటి సంస్థలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి దేశీయ విపణిలో ముడి చమురును కావాల్సిన దేశీయ రిఫైనరీకి విక్రయించే స్వేచ్ఛ ఉత్పత్తి కంపెనీలకు ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ముడి చమురు ఎగుమతులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ముంబయి హై ఫీల్డ్ నుంచి ఏటా 13-14 మిలియన్ టన్నుల ముడి చమురును ఓఎన్‌జీసీ ఉత్పత్తి చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ ముడి చమురును దేశంలోని ప్రభుత్వ రంగ రిఫైనరీలకే కాకుండా ప్రైవేట్ రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీలకూ ఓఎన్‌జీసీ విక్రయించవచ్చు.
- ప్రస్తుతం ముంబయి హై ముడి చమురును ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మాత్రమే ఓఎన్‌జీసీ విక్రయిస్తోంది. తన సొంత సంస్థ మంగళూర్ రిఫైనరీకి కూడా ఈ ముడిచమురును విక్రయించే వీల్లేదు.
- వేదాంతాకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా, రవ్వ క్షేత్రంలో ఉత్పత్తి చేస్తున్న ముడిచమురును హెచ్‌పీసీఎల్‌కు విక్రయిస్తోంది.
- ప్రస్తుత విధానం ప్రకారం.. ఒక రిఫైనరీ ఎంత పరిమాణంలో కొనుగోలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. దీంతో ధర విషయంలో బేరమాడే అవకాశాలు విక్రయ సంస్థలకు తక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరకే ముడి చమురును విక్రయించాల్సిన పరిస్థితి ఉంటోంది. అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం వల్ల ఇ-వేలంలో అధిక ధర చెల్లించే సంస్థకు, విక్రయ సంస్థలు ముడి చమురును విక్రయించే వీలు కలుగుతుంది.
1999 నుంచి అప్పగించిన చమురు క్షేత్రాల నుంచి వెలికితీస్తున్న ముడిచమురును ఏ దేశీయ రిఫైనరీకి అయినా విక్రయించే వీలుంది. అయితే ముంబయి హై (ఓఎన్‌జీసీ), రవ్వ క్షేత్రం (వేదాంతా) వంటి పాత క్షేత్రాల నుంచి వెలికితీసే చమురు కొనుగోలుదార్లను ప్రభుత్వమే నిర్ణయించడం ఇప్పటివరకు జరుగుతోంది.
ఇవీ చదవండి: అప్పడాలు, మజ్జిగపైనా జీఎస్టీ మోత.. మాంసం, చేపలపైనా బాదుడే..