ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు భయపడుతూ బతుకుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి సాఫ్ట్‌వేర్ సంస్థలు. అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి. ఒక్కసారిగా ఉన్నట్లుండి ఉద్యోగం పోతే ఈఎంఐ చెల్లింపులు, కుటుంబ నిర్వహణ కష్టమవుతుంది.
మాంద్యం ముప్పు, ఆర్ధిక భారం తగ్గించేందుకు ఇటీవల ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. దాదాపు ప్రముఖ సంస్థల అన్నింటిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఇటీవల కొద్ది నెలల కాలంలో తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థలు.. తక్కువ జీతం ఆఫర్ చేస్తూ కొత్త ఉద్యోగులు, ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నాయి.
ప్రముఖ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఇటీవల ఉద్యోగులను పెద్ద సంఖ్యలో లే ఆఫ్ చేశాయి. వారి స్థానాల్లో ఇప్పుడు కొత్తవారిని తీసుకోవడం మొదలుపెట్టాయి. తక్కువ జీతంతో పనిచేసే విదేశీ H-1B ఉద్యోగులను తీసుకుంటున్నట్లు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లీ ఫాంగ్ తన నివేదికలో స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, అనలిటిక్ కన్సల్టెంట్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ ఉద్యోగులను తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లు రిపోర్టులో పొందుపర్చారు.
అమెరికాలో అత్యంత నైపుణ్యంతో కూడిన సాంకేతిక ఉద్యోగాలకు తక్కువ చెల్లింపుతో టెక్కీలను తీసుకుంటున్నాయి అక్కడి కంపెనీలు. వీరిలో హెచ్1-బి వీసాపై ఉన్నవారు ఎక్కువమంది ఉన్నట్లు యూఎస్ కార్మికశాఖ డేటా ప్రకారం తేలింది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన Waymo సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసా కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. మెటాతో పాటు అమెజాన్, జూమ్, సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు H1-బీ వీసా కలిగిన అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకునేందుకు పోటీ పడుతున్నట్లు సమాచారం.
జనవరిలో ఫేస్‌బుక్ 21 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. గూగుల్ 12 వేల మందిని తీసివేసింది. ఇక అమెజాన్ అయితే భారీ సంఖ్యలో 27 వేల మందిని లే ఆఫ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు జనవరిలో మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అంటే దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల్లో కోత విధిస్తున్నప్పటికీ.. కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లో నియామకాలను కొనసాగిస్తున్నట్లు సీఈవో సత్య నాదెండ్ల స్పష్టం చేశారు. శాలరీలు తక్కువ ఆఫర్ చేస్తున్నప్పటికీ చాలామంది ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటం వల్ల భారతదేశానికి చెందిన ఎంతోమంది అమెరికాలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగం కోల్పోతే అమెరికాలో ఉండే హక్కును కోల్పోతారు. లేకపోతే త్వరలో కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలా ఉద్యోగం కోల్పోయినవారు బాధపడుతుండగా.. కొత్త హెచ్1-బీ అభ్యర్థులను కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి.