Google Antitrust Lawsuit Explained : ఇంటర్నెట్‌లో దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. అమెరికాలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోనుంది. గూగుల్ మొత్తం సెర్చ్ మార్కెట్‌ను తన గుప్పెట్లో పెట్టుకొని అన్ని డివైజ్‌లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా అవతరించిందని అమెరికా న్యాయవిభాగం ఆరోపిస్తోంది. ఈ విషయంలో బహుళజాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను నిరోధించే చట్టం-యాంటీట్రస్ట్ కింద మంగళవారం విచారణ చేపట్టింది. అన్ని ప్రాంతాలు, డివైజ్‌లలో గూగుల్ డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండేలా లాక్ చేసిందని నిరూపించేందుకు ఫెడరల్ న్యాయవాదులు, అటార్నీ జనరళ్లు చర్యలు చేపడుతున్నారు.
Google Antitrust Suit : గూగుల్ చట్టాన్ని ఉల్లంఘించిందని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి అమిత్ మెహతా నిర్ణయిస్తే తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మరో విచారణ జరగనుంది. గూగుల్‌తోపాటు మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉన్నతాధికారుల వాంగ్మూలాలు నమోదుచేసే అవకాశం ఉంది. గూగుల్ CEO సుందర్ పిచాయ్, యాపిల్ ఉన్నతాధికారి ఎడ్డీ క్యూను కూడా విచారణకు పిలవచ్చని తెలుస్తోంది.
ట్రంప్ హయాంలో కేసు
Google Antitrust Case : బహుళజాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను నిరోధించే చట్టాన్ని గూగుల్ ఉల్లంఘించిందని.. మూడేళ్ల క్రితమే అమెరికా న్యాయ విభాగం కేసు నమోదుచేసింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కేసు నమోదైంది. గూగుల్ తనకున్న ఏకఛత్రాధిపత్యాన్ని ఉపయోగించి మిగతా పోటీదారుల కంటే అనైతికంగా లబ్ధి పొందిందని అభియోగాలు మోపింది.
ఏటా రూ.83 వేల కోట్లు ఖర్చు
ఐఫోన్లు, సఫారీ, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్లలో డిఫాల్ట్‌గా గూగుల్ ఉండేందుకు ఏటా రూ.83 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) వరకు ఖర్చుపెట్టిందని ప్రభుత్వ న్యాయవాదులు ఆరోపించారు. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌లోనూ ఫోన్ తయారీదారులు యాప్ స్టోర్‌కు పూర్తిస్థాయి యాక్సెస్ పొందాలంటే గూగుల్‌నే డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండేలా నిబంధన పెట్టిందని తెలిపారు.
2.42 బిలియన్ యూరోల జరిమానా కట్టాల్సిందే..!
అమెరికా న్యాయవిభాగం ఆరోపణలను గూగుల్ తోసిపుచ్చింది. 90 శాతం మార్కెట్‌పై తమకు పట్టు ఉన్నప్పటికీ... ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్లు వాదించింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ నుంచి అమెజాన్, యెల్ప్ వంటి వెబ్‌సైట్ల వరకూ పోటీ ఉందని తెలిపింది. వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం సహా ఎక్కడికి వెళ్లాలనే విషయాలను తెలుసుకునేందుకు ఆయా వెబ్‌సైట్లు ఉపయోగిస్తున్నారని వాదించింది. తమ సెర్చ్ ఇంజిన్‌ను క్రమంగా అభివృద్ధి చేస్తూ వస్తున్నామని, అందుకే వినియోగదారులు తమవైపే మొగ్గుచూపుతున్నారన్నది గూగుల్ వాదన. కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌కు పర్యాయపదంగా గూగుల్ మారిపోయిందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
గూగుల్ 25వ వార్షికోత్సవాన్ని ఇటీవలే జరుపుకున్న నేపథ్యంలో యాంటీట్రస్ట్‌కు సంబంధించిన కేసు విచారణ మొదలైంది. 25 ఏళ్ల క్రితం లక్ష డాలర్ల పెట్టుబడితో గూగుల్ మొదలైంది. ప్రస్తుతం లక్షా 70వేల కోట్ల డాలర్లతో గూగుల్ మహాసామ్రాజ్యం విస్తరించింది. లక్షా 82వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా యాడ్స్ ద్వారానే 22 వేల 400 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. అమెరికా న్యాయవిభాగం నమోదుచేసిన కేసులో గూగుల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే తమ సెర్చ్ ఇంజిన్‌ను డిఫాల్ట్‌గా కొనసాగించేలా యాపిల్, ఇతర స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ తయారీ సంస్థలకు డబ్బు చెల్లించడాన్ని ఆపేలా ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. 1998లో మైక్రోసాఫ్ట్‌పైనా అమెరికా న్యాయ విభాగం యాంటీట్రస్ట్ కేసు నమోదు చేసింది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆధిపత్యానికి గండిపడగా గూగుల్ బాగా ఎదిగింది. తాజాగా గూగుల్‌పై ఆంక్షలు విధిస్తే... ఆ సంస్థ ఆధిపత్యానికి తెరపడే అవకాశం ఉంది.
గూగుల్‌కు బిగ్ షాక్.. నెలలోగా రూ.1,337కోట్ల ఫైన్ కట్టాల్సిందే!