Gautam Adani Business: ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు తన సామ్రాజ్య విస్తరణకు సంస్థల 'కొనుగోళ్ల'నే ప్రధాన మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 2014 నుంచి వివిధ రంగాల్లో 30కి పైగా సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా, ప్రముఖ స్థానం పొందడమే ఇందుకు నిదర్శనం. ఈ విధంగానే అత్యంత కీలకమైన విమానాశ్రయాలు, ఇంధనం, నౌకాశ్రయాలు, సిమెంటు రంగాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అదానీ గ్రూపు ఎదిగింది.
సిమెంటు: అంబుజా సిమెంట్స్, ఏసీసీ సంస్థల్లో స్విస్ సంస్థ హోల్సిమ్ లిమిటెడ్‌కు ఉన్న నియంత్రిత వాటాను 10.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.81,361 కోట్లు) కొనుగోలు చేయడం ద్వారా, ఏడాదికి 70 మిలియన్ టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం అదానీ గ్రూప్‌నకు సమకూరుతోంది. ఫలితంగా ఈ విభాగంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ 119.95 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యంతో మొదటి స్థానంలో ఉంది.
ఓడరేవులు, రవాణా: 24% మార్కెట్ వాటాతో వాణిజ్య ఓడరేవుల కార్యకలపాలపరంగా దేశంలోనే దిగ్గజ సంస్థగా అదానీ గ్రూపు ఉంది. ఓడరేవు ప్రాంతాలున్న ఏడు రాష్ట్రాల్లో అదానీ గ్రూపు కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అబాట్ సహా దేశీయంగా గంగవరం, ధమ్ర, కృష్ణపట్నం, దిఘి లాంటి ఓడరేవులతో పాటు రవాణా సంస్థ ఓషన్ స్పార్కిల్‌ను ఇటీవలి కొన్నేళ్లలో అదానీ గ్రూపు కొనుగోలు చేసింది.
విమానాశ్రయాలు: దేశంలోనే రద్దీపరంగా రెండోస్థానంలో ఉన్న ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజార్టీ వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. నవీ ముంబయి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. అహ్మదాబాద్, లఖ్‌నవూ, జైపూర్, తిరువనంతపురం, గువాహటి, మంగళూరు నగరాల్లోని విమానాశ్రయాల నిర్వహణ 50 సంవత్సరాల పాటు అదానీ గ్రూపు చేతికి చేరింది. వీటి ద్వారా సంవత్సరానికి 10 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
విద్యుత్తు: బొగ్గు, పునరుత్పాదక, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తిలో వ్యాపారాలను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. 5.4 గిగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థగా నిలిచింది. వివిధ సంస్థల కొనుగోళ్ల ద్వారానే ఈ వృద్ధిని సాధించింది. 6 థర్మల్ పవర్ ప్లాంట్లతో 12.41 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ గ్రూపు కలిగి ఉంది. వీటిల్లో చాలా వరకు కొనుగోళ్ల ద్వారా సంక్రమించినవే. మొత్తం 19 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ గ్రూప్ కలిగి ఉంది. విద్యుత్ సరఫరా కూడా గ్రూపునకు అధిక వృద్ధి అవకాశాలున్న కీలక విభాగంగా చెప్పొచ్చు. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరానికి అదానీ గ్రూపే విద్యుత్ సరఫరా చేస్తోంది.
గ్యాస్: అంతర్జాతీయ దిగ్గజ సంస్థ టోటల్ గ్యాస్‌తో కలిసి అతిపెద్ద సిటీ గ్యాస్ పంపిణీ సంస్థగా అదానీ టోటల్ గ్యాస్ ఉంది.
రిటైల్: సింగపూర్‌కు చెందిన విల్మర్ గ్రూప్ భాగస్వామ్యంతో అదానీ విల్మర్ సంస్థను ఏర్పాటు చేసి, ఇటీవలే నమోదు చేసింది. వంటనూనెలు, గోధుమపిండి తయారీ, బియ్యం, పప్పుదినుసులు, పంచదార విభాగాల్లో ఈ సంస్థ ఉంది.
మీడియా: తాజాగా మీడియా వ్యాపారంలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టింది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రై.లి. (క్యూబీఎంఎల్)లో 49% వాటా కొనుగోలు చేయబోతున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.
అంబుజా, ఏసీసీల్లో 26% వాటా కొనుగోలుకు అదానీ ఓపెన్ ఆఫర్: అంబుజా సిమెంట్స్, ఏసీసీల్లో 26 శాతం చొప్పున వాటాలను సాధారణ మదుపర్ల నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ కుటుంబం ఓపెన్ ఆఫర్‌ను సోమవారం ప్రకటించింది. ఈ రెండు సంస్థల్లో హోల్సిమ్ వాటాను 10.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.81,361 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే ఈ ఆఫర్ ఇచ్చింది. మారిషస్ అనుబంధ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా అదానీ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ చేసింది. ఒక్కో అంబుజా సిమెంట్స్ షేరును రూ.385, ఏసీసీ షేరును రూ.2300కు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. అంబుజాలో 26 శాతం వాటాకు సమానమైన 51.63 కోట్ల వరకు షేర్లను కొనుగోలు చేయడానికి రూ.19,878.57 కోట్లు వెచ్చించనుంది. ఏసీసీలో 26 శాతానికి సమానమైన 4.89 కోట్ల షేర్లను రూ.11,259.97 కోట్లతో కొనుగోలు చేయనుంది. ఇందుకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: ఆ రోజు చనిపోతాననుకున్నా: గౌతమ్ అదానీ