Freebies destroy economy: తాయిలాల చుట్టూ తిరిగే రాజకీయ చర్యలు ప్రమాదంతో కూడుకున్నవని, స్థాయికి మించిన ఉచిత హామీలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తాయని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ హెచ్చరించారు. ఇవి సామర్థ్యాల పెంపునకు గానీ, ఆర్థిక పురోగతికి కానీ బాటలు వేయవని అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 'ఉచిత ఆర్థిక విధానాలు ముమ్మాటికీ తప్పే. జాన్‌మేనార్డ్ కీన్స్ చెప్పినట్లు తప్పును వెంటనే గుర్తించగలిగితే కొన్నిసార్లు దానివల్ల పెద్ద ఉపద్రవాలు తొలగిపోతాయి. ఉచితాలతో కూడిన ఆర్థిక, రాజకీయ విధానాలు రెండూ పూర్తి లోపభూయిష్టమైనవని తెలుసుకుంటారు. తాయిలాలు ఇవ్వడమంటే పాతాళానికి పోటీ పడటమే. ఈ తరహా విధానాలు ఆర్థిక విధ్వంసానికి వేగవంతమైన పాస్‌పోర్ట్‌లాంటివి' అని ఎన్.కె.సింగ్ పేర్కొన్నారు.
'సమాఖ్య భారతంలో కేంద్ర, రాష్ట్రాలు రెండూ అవిభాజ్యం. కేంద్ర ప్రభుత్వ బలం రాష్ట్రాల దృఢత్వంపైనే ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్రాల సుస్థిరత కూడా ముఖ్యమే. ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థికలోటును చూస్తారు. వాటి అప్పులు, స్థూల ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధిపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రానికి అద్దంపడతాయి. ఉచితాలు చాలా చౌకగా కనిపించినా అవి ఆర్థిక వ్యవస్థకు పెనుభారతమవుతాయి. దీర్ఘకాలంలో జీవన నాణ్యత, సామాజిక సౌహార్దతపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఉచితాల విషయంలో రాజకీయ పోటీ సంస్కృతిని వీడి అత్యధిక వృద్ధిరేటును సాధించే ఆర్థిక మూలాల వైపు మళ్లాలి. సామర్థ్యం కోసం పరుగులు తీయడమంటే సంపద సృష్టి వైపు దృష్టిసారించడమే. ఉచితాలు మూల ఆర్థిక స్థిరత్వాన్ని అంతర్గతంగా దెబ్బతీస్తాయి. బడ్జెట్ కేటాయింపుల్లో మన ప్రాధాన్యతలను మారుస్తాయి. మొత్తం ప్రజల జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయడానికి బదులు రాయితీలు, ఇతర అంశాలకు కేటాయింపులు పెరుగుతాయి. ఇప్పటికే అప్పుల భారంతో అల్లాడిపోతున్న రాష్ట్రాలకు ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వదు' అని ఎన్.కె.సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంలపై భారీ బకాయిల భారమున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 'ఉచిత విద్యుత్తు వల్ల ఎరువులు, నీటి వినియోగం విపరీతంగా పెరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతాయి. ఉచితాలు.. మౌలిక వసతుల అవసరం ఉన్న తయారీ రంగంలో నాణ్యతను, పోటీతత్వాన్ని తగ్గించి సమర్థతను దెబ్బతీస్తాయి. వృద్ధికి అవరోధంగా మారి ఉపాధిపై ప్రభావం చూపుతాయి' అని ఎన్.కె.సింగ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఆర్థిక కష్టాలు తప్పవు.. జీడీపీపై చమురు ధరల ప్రభావం'