Jamshed J Irani passes away:టాటా స్టీల్ మాజీ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి జంషెద్‌పుర్‌లో మరణించినట్లు టాటాస్టీల్ తెలిపింది. ఇరానీకి టాటా స్టీల్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆయన 2011 జూన్‌లో టాటా స్టీల్ బోర్డు నుంచి తప్పుకున్నారు. "స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ మరణం పట్ల చాలా బాధపడుతున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని టాటా స్టీల్ ట్వీట్ చేసింది.
1936 జూన్ 2న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జంషెడ్ ఇరానీ జన్మించారు. 1963లో బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోషియేషన్‌లో సీనియర్ సైంటిఫిక్ అధికారిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1968లో భారత్‌కు తిరిగి వచ్చిన జంషెడ్.. టాటా స్టీల్‌లో చేరారు. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధికారికి అసిస్టెంట్‌గా పనిచేశారు. 1979లో జనరల్ మేనేజర్.. 1985లో అధ్యక్షుడిగా పదోన్నతులు పొందారు. 1992లో టాటా స్టీల్‌కు ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో జులై 2001 వరకు కొనసాగారు. జంషెడ్ జె ఇరానీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. పద్మభూషణ్‌తో ఆయనను సత్కరించింది.