వచ్చే ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమేనని, వృద్ధికి అవసరమైన సంస్కరణలను తేవడంలో ప్రభుత్వం విఫలం కావడమే ఇందుకు నేపథ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పూర్వ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రపంచానికీ రాబోయే సంవత్సరం కష్టంగానే గడవొచ్చని అన్నారు. కొవిడ్-19 పరిణామాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడిన దిగువ మధ్య తరగతిని దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. ఇంధన సుస్థిరత కోసం.. పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
దేశంలో తదుపరి విప్లవం సేవల రంగంలోనే వస్తుందని రాజన్ అన్నారు. భారత్, అమెరికా, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రస్తుత స్థితి, చిన్న పరిశ్రమలకు ఎదురవుతున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలు తదితర అంశాలపై ఇటీవల భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రాజన్ అభిప్రాయాలను రాహుల్‌గాంధీ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. దేశంలో నలుగురయిదుగురు పారిశ్రామికవేత్తలు మరింత సంపద ఆర్జించడాన్ని ప్రస్తావిస్తూ.. వీళ్లకు ఒక రకమైన పరిస్థితులు, మిగిలిన వారికి-రైతులకు మరో రకం పరిస్థితులు నెలకొనడం పెద్ద సమస్యేనని రాజన్ అన్నారు. ఇది పెట్టుబడిదార్ల వల్ల వచ్చిన సమస్య కాదని ఆయన తెలిపారు.
దెబ్బతింది దిగువ మధ్యతరగతే..
కొవిడ్-19 సమయంలో ఇంటివద్ద నుంచి పనిచేసే అవకాశం లభించిన ఎగువ మధ్య తరగతి వర్గాల ఆదాయాలపై ప్రభావం పడలేదని రాజన్ అన్నారు. అయితే పరిశ్రమల్లో భౌతికంగా పనిచేసే వాళ్లు తమ ఆదాయాలను కోల్పోయారని రాజన్ పేర్కొన్నారు. 'కొవిడ్-19 పరిణామాల్లో ఆదాయ వ్యత్యాసాలు మరింత పెరిగాయి. ధనికులకు ఎలాంటి సమస్య రాలేదు. అల్పాదాయ వర్గానికి రేషన్ రూపంలో సాయం అందింది. కానీ దిగువ మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం పడింది. ఉద్యోగాలు పోయినందున వీరు ఆదాయం కోల్పోయార'ని రాజన్ తెలిపారు. ఈ వర్గ సంక్షేమంపై విధాన రూపకర్తలు దృష్టి సారించాలని సూచించారు.
సేవారంగంలో తదుపరి విప్లవం..
తదుపరి విప్లవం సేవల రంగంలో ఉంటుందని రాజన్ తెలిపారు. 'అమెరికాకు వెళ్లకుండానే ఇక్కడ నుంచి అమెరికా కోసం పనిచేయొచ్చు. డాక్టర్లు ఏ ప్రాంతంలోని వారికైనా టెలిమెడిసిన్ సేవలు అందించవచ్చు. తద్వారా విదేశీ మారకపు నిధులను ఆర్జించే వీలుంటుంది. ఎగుమతుల్లో మన దేశాన్ని సూపర్ పవర్‌గా మన సేవల రంగం తీర్చిదిద్దుతుంద'ని రాజన్ విశ్లేషించారు. కొత్త రకం హరిత విప్లవం కూడా వస్తుందని అన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చని.. ఈ ప్రభావం భారత్‌పై కూడా కనిపించవచ్చని తెలిపారు. 'ఎగుమతులు కొంత మేర నెమ్మదించాయి. అధిక ద్రవ్యోల్బణం సమస్య వెంటాడుతోంది. ఇవి వృద్ధికి ప్రతికూలాంశాలేన'ని ఆయన అన్నారు.