ETV Bharat / business

బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం.. కేంద్రం కీలక నిర్ణయం - india impose ban on rice export

Export Duty On Rice: దేశంలో ఆహారధాన్యాల నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పుడు బియ్యం తప్ప.. అన్ని బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం మేర ఎగుమతి సుంకాన్ని విధిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నూకల ఎగుమతులపై పూర్తి నిషేధం విధిస్తూ శుక్రవారం మరో ప్రకటన చేసింది.

india bans rice exports
బియ్యం ఎగుమతుల ఆంక్షలు
author img

By

Published : Sep 9, 2022, 12:23 PM IST

Export Duty On Rice: దేశంలో ఆహారధాన్యాల నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోధుమ, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సర్కార్‌ తాజాగా బియ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చింది. ఉప్పుడు బియ్యం తప్ప.. అన్ని బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం మేర ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా సరఫరాలను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా నూకల ఎగుమతులపై పూర్తి నిషేధం విధిస్తూ శుక్రవారం మరో ప్రకటన చేసింది. అయితే, ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న వాటికి మాత్రం ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించింది. సెప్టెంబరు 15 వరకు ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్‌ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరిన నిల్వల ఎగుమతులను కూడా ఆంక్షల పరిధి నుంచి తప్పించింది.

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోదాముల్లో గోధుమలు, బియ్యం నిల్వలు తగ్గాయని వార్తలు వచ్చాయి. గోధుమ నిల్వలు 14 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు ఇటీవల ఓ ఉన్నతాధికారి తెలిపారు. బియ్యం నిల్వలు సైతం పడిపోయినప్పటికీ.. ఇంకా కేంద్రం విధించిన పరిమితి కంటే రెండింతలు అధికంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్‌ పథకం 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన'ను సెప్టెంబరు 30 తర్వాత కొనసాగించాలా.. లేదా.. అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక, ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో వరిసాగు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుబడి తగ్గి నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కేంద్రం ఆహారధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది.

ఇవీ చదవండి: క్రెడిట్‌ కార్డ్ ఫ్రీ అనుకుంటున్నారా? అయితే పొరబడ్డట్టే!

ఉద్యోగుల్లో మానసిక అనారోగ్యం.. కంపెనీలకు ఏటా రూ.లక్ష కోట్ల ఖర్చు!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.