interest rate hike: జూన్ 6-8 తేదీల్లో జరగబోయే తదుపరి ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో కీలక రేట్ల పెంపు ఉంటుందని, ఎంత అనేది ఇప్పుడు చెప్పలేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 4 నెలలుగా అధిక స్థాయిల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రేట్ల పెంపు తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈనెలారంభంలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి ఆర్‌బీఐ చేర్చింది.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని దాస్ అన్నారు. గోధుమ ఎగుమతులపై నిషేధం, పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం కోత లాంటి నిర్ణయాలు ధరలు దిగివచ్చేందుకు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. 'రష్యా, బ్రెజిల్ మినహా దాదాపు ప్రతి ఒక్క దేశంలోనూ వడ్డీ రేట్లు మైనస్‌లోనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల ద్రవ్యోల్బణ లక్ష్యం 2 శాతం. కానీ జపాన్, మరో దేశం మినహా మిగిలిన అభివృద్ధి చెందిన దేశాల ద్రవ్యోల్బణం ప్రస్తుతం 7 శాతానికి పైగానే ఉంద'ని దాస్ వివరించారు. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల అంశాలూ ఉన్నాయని, ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకుంటుండటం ఇందులో ఒకటని శక్తికాంత దాస్ చెప్పారు.
ఇదీ చదవండి: ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్.. 33 గంటలకు 10 లక్షల మంది నిరుపేదలు!