EPFO Higher Pension Last Date : ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వచ్చే వేతనజీవుల అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన గడువు జూన్ 26తో పూర్తి కానుండడం వల్ల దీనిని జులై 11వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. దీంతో వేతనజీవులు వచ్చే నెల 11వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కలిగింది. అంతకుముందు మే 3వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్ 26 వరకు పొడిగించింది.
అధిక పింఛను ఆన్‌లైన్ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు, కచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌కు సర్వర్ మొరాయించడం వంటి కారణాలతో అర్హులైన పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో అధిక పింఛను దరఖాస్తు గడువును పొడిగించాలంటూ పింఛనుదారులు, సీబీటీ సభ్యులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఈపీఎఫ్‌ఓ కమిషనర్‌కు గతంలో విజ్ఞప్తి చేయడం వల్ల మే 3 నుంచి జూన్ 26వరకు అవకాశం ఇచ్చారు. తాజాగా మరోసారి గడువు పొడిగించడం ద్వారా ఇప్పటివరకు దరఖాస్తు చేయలేకపోయిన వారికి కూడా మరో ఛాన్స్ ఇచ్చినట్టయింది.
ఎవరు అర్హులు..?
EPF Higher Pension Eligibility : ఉద్యోగుల పింఛను పథకం-1995 చట్టసవరణకు ముందుగా (2014 సెప్టెంబరు 1కి ముందు) ఈపీఎఫ్ చందాదారుగా చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ.. ఈపీఎస్ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారు అర్హులు. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు వీలు కల్పించింది ఈపీఎఫ్.
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొండిలా..
EPF Higher Pension Apply Online : ఈపీఎఫ్‌వో పింఛనుదారులు, వేతనజీవుల కోసం ఈపీఎఫ్ మెంటర్ పోర్టల్ హోంపేజీలో ప్రత్యేక లింకును ఏర్పాటు చేసింది సంస్థ. ఈ పింఛనుకు దరఖాస్తును చేసుకునే వారు హోంపేజీలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింకుపై క్లిక్ చేయాలి. అనంతరం ఈపీఎస్ చట్టం 11(3) కింద ఆప్షన్‌కు దరఖాస్తు కోసం క్లిక్ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) ఖాతాద్వారా పూర్తి చేయాలి. ఈపీఎఫ్‌ఓ రికార్డుల ప్రకారం చందాదారు పుట్టిన తేదీ, ఆధార్ నంబరు వంటి వివరాలను నమోదు చేయాలి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబరును వినియోగించాలి. చందాదారు వివరాలన్నీ ఇలా మొత్తం 4 దశల్లో పూర్తి చేశాక.. దరఖాస్తు చేసుకున్నట్లుగా ఓ ప్రత్యేక నంబరు వస్తుంది.
ఇవీ చదవండి : EPFO గుడ్‌న్యూస్.. అధిక పింఛను దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?
ఉద్యోగులకు EPF శుభవార్త! అందుబాటులోకి అధిక పింఛను ఆన్‌లైన్ దరఖాస్తు.. అప్లై చేసుకోండిలా..