Elon Musk Twitter: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను తన నియంత్రణలోకి తీసుకున్న తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఈ సామాజిక మాధ్యమం ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని అన్నారు. అలాగే మితవాదం, వామపక్ష వాదం అనే తేడాలు లేకుండా రాజకీయంగా తటస్థ వైఖరిని అనుసరించాలన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్లో త్వరలో కీలక మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు మస్క్‌కు విక్రయిస్తున్నట్లు సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
Musk Cocacola: మరోవైపు తాను కోకకోలా కంపెనీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు మస్క్. కోకకోలాకు తిరిగి కొకైన్ వైభవం తీసుకొస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. గతంలో కోకకోలాను కోకా ఆకులు, కోలా గింజలతో తయారు చేసేవారు. కోలా గింజలు కెఫిన్ మూలం కాగా, కోకా ఆకుల నుంచి కొకైన్ వస్తుంది. కోకకోలా ఒకానొక సమయంలో ఎక్కువగా కోకా ఆకుల మీదే ఆధారపడింది. తర్వాత కొకైన్‌ను మాదక్ర ద్రవ్యంగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల కోకకోలా డీ కోకైనైజ్డ్ కోకా ఆకులతో డ్రింక్ తయారు చేస్తోంది. ఇప్పుడు కొకైన్‌ను మళ్లీ కోకకోలాలో చేరుస్తానంటూ మస్క్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మెక్‌డొనాల్డ్స్‌ను కొనుగోలు చేస్తానంటూ గతంలో తాను చేసిన ట్వీట్‌ను తిరిగి షేర్ చేసిన మస్క్.. తాను అద్భుతాలు చేయలేనంటూ మరో అర్థం కాని ట్వీట్ చేశారు. కానీ జోక్‌గా ట్వీట్ చేసిన ప్రతి అంశాన్ని నిజం చేస్తూ వెళ్తున్న మస్క్.. ఇప్పడు కోకకోలాను కూడా కొనుగోలు చేస్తాడేమో చూడాలి.
Elon musk buys twitter: ట్విట్టర్‌కు, ఎలాన్ మస్క్‌కు కుదిరిన ఒప్పందం ప్రకారం.. సంస్థ వాటాదారులకు ఒక్కో షేరుకు 54.20 డాలర్లు దక్కుతాయి. ట్విట్టర్‌ను కొనడానికి ముందు సంస్థలో తాను షేర్లు కొనుగోలు చేసినట్లు మస్క్ వెల్లడించిన రోజు కంటే ఈ షేరు విలువ దాదాపు 38శాతం అధికం. మరోవైపు తమ ఉద్యోగుల పట్ల తనకు గర్వంగా ఉందని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ అన్నారు. ఆందోళనకర పరిస్థితుల్లోనూ వారు పనిపైనే దృష్టి కేంద్రీకరించి నిర్విరామంగా సేవలందిస్తున్నారని కొనియాడారు.
ఇదీ చదవండి: ట్విట్టర్‌ను మస్క్ ఏం చేయబోతున్నాడు?
ట్విట్టర్‌ను అమ్మేశాం.. మన భవిష్యత్ ఏంటో తెలియదు: ఉద్యోగులతో సీఈఓ