టెక్ దిగ్గజం యాపిల్‌తో తలెత్తిన వివాదం ముగిసినట్లు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. యాపిల్ స్టోర్ నుంచి ట్విటర్‌ను నుంచి తొలగించే ఆలోచన లేదని యాపిల్ సీఇఓ టిమ్ కుక్ స్పష్టంగా చెప్పినట్లు చెప్పారు. బుధవారం యాపిల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మస్క్.. టిమ్ కుక్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఇరువురి మధ్య సుహృద్భావ సంభాషణలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్విటర్, యాపిల్‌కు మధ్య కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. ట్విటర్‌కు యాపిల్ ప్రకటనలు నిలిపివేసిందని మస్క్ ఆరోపిస్తూ వస్తున్నారు. త్వరలో యాపిల్ స్టోర్ నుంచి ట్విటర్ యాప్‌ను తొలగిస్తామని హెచ్చరించినట్లు ఇటీవల ఆయన తెలిపారు. అయితే యాప్ స్టోర్‌లో ట్విటర్‌ను కొనసాగించడంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రకటనల సంగతేంటనే విషయాన్ని మస్క్ వెల్లడించలేదు. అయితే మస్క్ ఆరోపణలపై యాపిల్ ఎక్కడా ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.