సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్వహణ ఖర్చు తగ్గింపు కోసం తీసుకునే చర్యలు విపరీతంగా ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం బట్టి తెలుస్తోంది. ట్విట్టర్‌కు చెందిన శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయంలో నిర్వహణ సిబ్బందిని తొలగించినట్లు, దాంతో కనీస సదుపాయాలు అందక ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించింది. చివరకు టాయిలెట్ పేపర్‌ను కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలిపింది.
జీతాలు పెంచమని కోరుతూ నిర్వహణ సిబ్బంది సమ్మెకు వెళ్లడం వల్ల వారిని సంస్థ నుంచి తొలగించారు. అకస్మాత్తుగా వారంతా వెళ్లిపోవడం వల్ల వాష్‌రూమ్‌లు, ఆఫీస్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఆ కథనం పేర్కొంది. సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులు సొంతంగా టాయిలెట్ పేపర్ తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపింది. మరోపక్క ట్విట్టర్ భవనంలోని రెండు అంతస్తుల్లోనే విధులు నిర్వర్తించాలని మస్క్ చెప్పినట్లు, మిగిలిన నాలుగు అంతస్తులను మూసివేసినట్లు తెలుస్తోంది. అలాగే కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని డేటా సెంటర్‌ను మూసివేయాలని మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఇది సైట్ పనితీరును దెబ్బతీస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఖర్చులు తగ్గించుకోవడానికే ఆయన మొగ్గు చూపారు.
సియాటిల్‌లోని భవనానికి అద్దె చెల్లించడం నిలిపివేయడం వల్ల ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది. న్యూయార్క్ నగరం, శాన్‌ఫ్రాన్సిస్కోలో మాత్రమే కార్యాలయాలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మస్క్ వ్యవహార శైలితో కొందరు ఉద్యోగులు తాము పరాయి వారం అనే భావనలో ఉన్నారట. సంస్థ కార్యకలాపాల గురించి బయటకు లీక్ చేసేవారి గురించి తెలియజేయాలని తన కింది ఉద్యోగులకు మస్క్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై చేసే ఖర్చు కాకుండా ఇతర(నాన్ లేబర్) ఖర్చులను ట్విట్టర్ బడ్జెట్ నుంచి 500 మిలియన్ల డాలర్లు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.