LPG price hike today: వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేరకు పెంచుతున్నట్లు చమరు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి.
తాజా పెంపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర.. రూ.1769 నుంచి రూ.2119.50కు చేరింది. అలాగే కోల్‌కతాలో చూస్తే.. దీని ధర రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ఇక ముంబయిలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721గా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ. 2071కు చేరింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268కు పెరిగింది. దేశ రాజధానిలో గృహాల్లో వినియోగించే సిలిండర్ ధర రూ.1053 నుంచి రూ.1103కు చేరింది.
తెలుగు రాష్టాల్లో..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం 8 నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో ఈ రేటు తాజాగా రూ.1155కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ప్రస్తుతం అక్కడ రేటు రూ.1161 పలుకుతోంది. కాగా, గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేయడం వల్ల సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనుంది. ఇప్పటికే నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది.
2023లో రెండోసారి..
ఈ ఏడాది కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 1న కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.25 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.