Domestic LPG cylinder: వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1052కి చేరింది.
వాణిజ్య సిలిండర్: కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి చమురు సంస్థలు. మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.102.50 పెంచటం వల్ల దిల్లీలో రూ.2253గా ఉన్న గ్యాస్ బండ రూ.2355.50కి చేరింది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.655కు పెంచారు. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇదీ చూడండి: 'పెట్రో బాదుడుతో పేదలకు భారం.. కేంద్రానికి రూ.10వేల కోట్ల లాభం!'