Crisil Rating Report: రాబోయే కొన్ని నెలల్లో దేశంలో ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదార్లు నిధులు ఉపసంహరిస్తుండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలకు దేశీయ ఒడుదొడుకులు తోడవుతాయని పేర్కొంది. మార్చిలో తమ ఆర్థిక పరిస్థితుల సూచీ (ఎఫ్‌సీఐ) సున్నా దిగువకు చేరిందని, దేశీయ ఆర్థిక పరిస్థితులు క్షీణించడాన్ని ఇది సూచిస్తోందని వెల్లడించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు పెద్ద బ్యాంకులు రుణ రేట్లు పెంచాయని, రుణ వ్యయాల పెరుగుదలకు ఇది దారితీయొచ్చని అభిప్రాయపడింది. అయితే కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు, విదేశీ మారకపు నిల్వల బలోపేతానికి చేపట్టిన చర్యలు అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునేందుకు దోహదపడతాయని క్రిసిల్ వివరించింది. ఈక్విటీ, డెట్, మనీ, ఫారెక్స్ మార్కెట్లలో 15 కీలక అంశాలను విశ్లేషించి, ఎఫ్‌సీఐ సూచీని క్రిసిల్ రూపొందిస్తుంది. క్రిసిల్ తన నివేదికలో ఏమందంటే..
దశాబ్ద సగటు కంటే అధిక ఒత్తిడి: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఆర్థిక పరిస్థితులు కఠినం కావడమే కాకుండా గత దశాబ్ద సగటు పరిస్థితులతో పోలిస్తే ఎక్కువ ఒత్తిడితో ఉన్నాయి. ముడిచమురు ధరలు బాగా పెరగడం వల్ల జీడీపీ, ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు, రూపాయి, ద్రవ్యలోటు వంటి ప్రధాన ఆర్థిక సూచికలపై ప్రభావం పడుతోంది.
రెపోరేటు 50-75 బేసిస్ పాయింట్లు పెరగొచ్చు
ఆర్‌బీఐ కీలక రేట్ల విషయంలో సర్దుబాటు ధోరణి కొనసాగించడం కొంత ఉపశమనం ఇచ్చింది. అయితే అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లు పెంచొచ్చు. 2022-23లో రెపో రేటు 50-75 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు ఇప్పటికే ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడం ప్రారంభించాయి. రూపాయి కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి విలువ మార్చిలో 1.7 శాతం తగ్గింది.
2013 కంటే మెరుగే.. 2013తో పోలిస్తే కరెంటు ఖాతాలోటు - ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం మాత్రం ఊరట కలిగించే విషయమే. అందువల్ల అప్పటికంటే మెరుగ్గానే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం కలిసొచ్చే అంశం.
ఇదీ చూడండి : క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు