digital payments in india: డిజిటల్ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు 'వరల్డ్‌లైన్ ఇండియా' డిజిటల్ పేమెంట్స్ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్/ క్రెడిట్ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది. ఇందులో డెబిట్ కార్డులు 93 కోట్లు, క్రెడిట్ కార్డులు దాదాపు 7 కోట్ల మేరకు ఉన్నాయి. క్రెడిట్ కార్డుల మార్కెట్లో ప్రైవేటు బ్యాంకుల వాటా 67 శాతం ఉంటే, ప్రభుత్వ బ్యాంకుల వాటా 24 శాతం కనిపిస్తోంది.
ఈ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
- గత ఏడాదిలో 457 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 105 శాతం వృద్ధి కనిపించింది. ఈ లావాదేవీలు విలువ రూ.8.2 లక్షల కోట్లు.
- మొబైల్ యాప్ ఆధారిత లావాదేవీలు 106 శాతం పెరిగాయి.
- ఇంటర్నెట్ ఆధారిత చెల్లింపుల్లోనూ 12 శాతం వార్షిక వృద్ధి నమోదు కావటం గమనార్హం.
- క్రెడిట్ కార్డుల వినియోగానికి సంబంధించి సగటు లావాదేవీ విలువ రూ.4,122 ఉన్నట్లు వెల్లడైంది.
- అదే డెబిట్ కార్డు విషయానికి వచ్చే సరికి సగటు లావాదేవీ పరిమాణం రూ.1,804 మాత్రమే ఉండటం గమనార్హం.
- క్రెడిట్ కార్డులను అత్యధికంగా జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
- డెబిట్ కార్డులను ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అధికంగా జారీ చేశాయి.
- పీఓఎస్ టెర్మినళ్ల విషయానికి వస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్ బ్యాంకు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, యూబీఐ జారీ చేసిన పీఓఎస్ టెర్మినళ్లు అధికంగా వినియోగంలో ఉన్నాయి.
- డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఫిజికల్ టచ్ పాయింట్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక అగ్రస్థానంలో ఉన్నాయి.
- ఫిజికల్ టచ్ పాయింట్ల ద్వారా అధికంగా లావాదేవీలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. రెండు, మూడు స్థానాల్లో బెంగుళూరు, చెన్నై నగరాలు ఉన్నాయి.
అందుబాటులోకి కొత్త సాధనాలు..
గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ చెల్లింపులకు వినియోగదార్లు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా వరల్డ్‌లైన్ సౌత్ ఏషియా ఎండీ దీపక్ చంద్‌నాని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కార్డులు, యూపీఐ సదుపాయాలకు తోడు భారత్ బిల్‌పే, ఎన్‌ఈటీసీ ఫాస్ట్ ట్యాగ్ తదితర నూతన చెల్లింపు సాధనాలు సైతం అందుబాటులోకి వస్తున్నందున డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడిందని విశ్లేషించారు.
ఇదీ చూడండి: 'వాటి కోసం మైక్రోసాఫ్ట్ రూ.వేల కోట్ల ముడుపులు'