దేశంలో బంగారానికి ఉండే క్రేజే వేరు. బంగారం అనేది సంపదకు చిహ్నంగా భావిస్తారు. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండగలం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందని భారతీయులు నమ్ముతారు. అయితే, బంగారం అనగానే చాలా మంది ఇప్పటికీ నగలే కొనాలేమో అనుకుంటారు. కానీ, కాగితంపై కూడా బంగారాన్ని కొనొచ్చని మీకు తెలుసా? మరి అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటో ఓసారి తెలుసుకుందాం.
ప్రభుత్వ పసిడి బాండ్లు..
బంగారం నాణ్యత విషయంలో చాలా మందికి అనేక అనుమానాలుంటాయి. పైగా భద్రపర్చుకోవడం ఒక సమస్య. దీనికి పరిష్కారమే పసిడి బాండ్లు. పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5శాతం వడ్డీ లెక్కన.. ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ప్రభుత్వం ఈ బాండ్లను దశలవారీగా విడుదల చేస్తుంటుంది. బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతా ఉన్నవారెవరైనా పసిడి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక్కో పసిడి బాండ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందస్తు ఉపసంహరణ ఆప్షన్ ఉంటుంది. వీటిపై మూలధన రాబడి పన్ను కూడా ఉండదు.
గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్లు..
గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణ ట్రేడింగ్ రోజుల్లో ఎప్పుడైనా యూనిట్ల వారీగా బంగారాన్ని కొనుగోలు చేసి విక్రయించొచ్చు. ధర దాదాపు ఆరోజు భౌతిక బంగారానికి ఉన్న ధరే ఉంటుంది. క్వాంటమ్ గోల్డ్ ఫండ్, గోల్డ్‌మన్‌శాక్స్ గోల్డ్ ఈటీఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఫండ్లు మంచి రాబడినిచ్చినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
డిజిటల్ గోల్డ్ అంటే?..
డిజిటల్ గోల్డ్ అంటే మీ దగ్గర భౌతికంగా బంగారం ఉండదు. మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని వర్చువల్‌గా ఆన్‌లైన్ ఖాతాలో ఉంచుకోవచ్చు. డబ్బులు చెల్లించిన ప్రతిసారీ అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు. సాధారణంగా లోహ రూపంలో పసిడిని కొనాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.5,000 అయినా కావాలి. అంతకంటే తక్కువ అంటే కష్టమే. కానీ, డిజిటల్ గోల్డ్‌లో అలా కాదు. ఒక్క రూపాయి విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. పైగా నకిలీ బంగారాన్ని గుర్తించడం కష్టమవుతున్న ప్రస్తుత రోజుల్లో డిజిటల్ గోల్డ్ వల్ల అటువంటి సమస్యలేమీ ఉండవు. మన తరఫున విక్రేతలే బంగారాన్ని కొని సురక్షితంగా ఉంచుతారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. పైగా వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో ధరలపై స్థానిక పరిణామాల ప్రభావం ఉండదు. మీరు కావాలనుకున్నప్పుడు లోహరూపంలో మీకు అందజేస్తారు. ఆన్‌లైన్ రుణాలకు డిజిటల్ గోల్డ్‌ను తనఖాగా కూడా పెట్టుకోవచ్చు.
అందుబాటులో బంగారు నాణేలు..
ఒక గ్రాము, 10 గ్రాములు, 50 గ్రాముల పసిడి నాణేలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ ఆధీనంలోని ఎంఎంటీసీ హాల్‌మార్క్‌తో కూడిన నాణేలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీని విక్రయశాలలు ఉన్నాయి. కొనేటప్పుడు ఎక్స్ఛేంజీ నియమాలను అడిగి తెలుసుకోండి.
శుభకార్యాల కోసం..
మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలుంటే మాత్రం నగల రూపంలో బంగారం కొనుగోలు చేయడమే ఉత్తమం. పైగా మిగిలిన వాటితో పోలిస్తే.. నగలరూపంలో బంగారం కొనడం అందరికీ తెలిసిన సులభమైన పద్ధతి కూడా. అయితే.. తయారీ ఖర్చులు మీ రాబడికి 5 నుంచి 15 శాతం వరకు కోత పెడతాయి. అలాగే ఎక్స్ఛేంజీ సమయంలో విలువను కోల్పోవాల్సి ఉంటుంది. వినియోగదారుడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా హాల్‌మార్క్ సరిచూసుకోవాలి.