Dhanteras 2023 Gold Buying : ధంతేరాస్ లేదా ధనత్రయోదశి పండుగను ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ శుభ సందర్భంగా బంగారాన్ని కొనుగోలుచేయడమనే అలవాటు మన సంప్రదాయంలో భాగంగా వస్తోంది. అయితే ధంతేరాస్ పర్వదినం నాడే బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేయాలి? ఆ పండుగ ప్రత్యేకత ఏమిటి? ఈ సంవత్సరం ధనత్రయోదశి రోజు పసిడి కొనుగోలు చేయడానికి శుభ ముహూర్తం? తదితర వివరాలు మీ కోసం.
లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు
దేవదేవుళ్లు క్షీరసాగరాన్ని మథనంచేసే సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిందని భక్తుల నమ్మకం. అలాంటి శుభప్రదమైన ధన త్రయోదశి రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల సకల శుభాలు జరిగి, సంపదలు సమకూరుతాయని వారి విశ్వాసం. అందువల్లనే ధన త్రయోదశి రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ధంతేరాస్ (ధనత్రయోదశి) పండుగకు మన భారతీయ సనాతన సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే అదృష్టం వరిస్తుందని ప్రజల నమ్మకం. ప్రతికూల దుష్టశక్తులను దూరం చేసే శక్తి ధనత్రయోదశికి ఉందనే అచంచల విశ్వాసం భక్తుల్లో నాటుకొని ఉంది. కొన్ని కుటుంబాలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి పురాతన సంప్రదాయాలను అనుసరించే మార్గంగా ధంతేరాస్ సందర్భంగా బంగారం కొనడం ఒక ఆచారంగా భావిస్తారు.
- భవిష్యత్ తరాలకు భరోసా : సాధారణంగా చాలా మంది బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తుంటారు. దీనిని కొనుగోలు చేయడం వల్ల సంపద సృష్టికి తోడ్పడుతుందని వారి నమ్మకం. పసిడి విలువ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అందువల్ల ధనత్రయోదశినాడు కొనుగోలు చేస్తే సకల శుభాలు జరుగుతాయనే విశ్వాసం ఉండటం వల్ల ధంతేరాస్ నాడు బంగారం కొనుగోలు చేస్తారు. తమ వారసుల భవిష్యత్‌కు భరోసానిచ్చేందుకు బంగారాన్ని ఈ రోజున కొనుగోలు చేస్తుంటారు.
- అలంకరణలో మేటి.. బంగారం : బంగారం కేవలం పెట్టుబడిగానే కాదు. అలంకరించుకునే అత్యంత విలువైన వాటిలో ఒకటి. ధంతేరాస్ నాడు తమకి ఇష్టమైన వారికి, సన్నిహితులకు బంగారు కాయిన్లను కొందరు కొనుగోలు చేసి ఇస్తుంటారు. వీటితో పాటు వివిధ డిజైన్లతో ఉన్న బంగారు అభరణాలు ధరించిన వారిని నలుగురిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తాయి. ఈ అభరణాలను హోదాకు చిహ్నంగా కొంతమంది పరిగణిస్తున్నారు.
- అనుబంధాలకు ప్రతీక : పసిడి కొనుగోలు చేయడానికి ధంతేరాస్ పండుగ శుభదినం అని అధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇటువంటి శుభప్రదమైన రోజు బంగారాన్ని కొనుగోలు చేసి తమ కుటుంబ సభ్యులకు, ఆప్తులకు ఇచ్చే అవకాశాన్ని ఈ పండుగ కల్పిస్తుంది. ఈ విధంగా బహుమతులు ఇవ్వడం వల్ల అనబంధాలు చాలా కాలం పదిలంగా నిలుస్తాయనేది వారి నమ్మకం. గోల్డ్ కాయిన్లు, బంగారు అభరణాలును కొనుగోలు చేసే సంప్రదాయం తరాలుగా వస్తోంది.
- శుభముహూర్తం : ధ్రిక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ధంతేరాస్‌ను నవంబర్ 10 వ తేదీన చేసుకోవచ్చు. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడానికి నవంబర్ 10 వ తేదీన మధ్యాహ్నం 12: 35 నిమిషాల నుంచి నవంబర్ 11 వ తేదీ మధ్యాహ్నం 1:57 నిమిషాల వరకు శుభప్రదం అని పంచాంగం చెబుతోంది.