Credit Card Reward Points : విహార యాత్రలు చేద్దామనుకునేవారికి మంచి అవకాశం. మీ దగ్గర కేవలం ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు. రివార్డ్ పాయింట్స్‌తోనే మీరు దేశం మొత్తాన్ని చుట్టేయవచ్చు. ముఖ్యంగా ట్రావెలింగ్ సీజన్లో ప్రముఖ విమానయాన సంస్థలు అన్నీ తమ ప్రయాణ ఛార్జీలను భారీగా తగ్గించాయి. లాయల్టీ ప్రోగ్రామ్స్‌తో, క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఆఫర్స్‌తో ప్రయాణికులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
కొవిడ్-19 తరువాత పర్యటక రంగం బాగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ విహార యాత్రలను మళ్లీ మొదలుపెడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకట్టుకోవడానికి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే దేశీయ ప్రయాణాలకు మాత్రమే ఈ అవకాశాలను కల్పిస్తుండడం, మరీ ముఖ్యంగా లిమెటెడ్ ఛాయిస్ మాత్రమే ఉండడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం.
భారతదేశం - ఒక పర్యటక స్వర్గం
మన భారతదేశం పర్యటకులకు ఒక స్వర్గం. ఇక్కడ చల్లని మంచు కురిపించే హిమాలయాలు ఉన్నాయి. చుక్క నీరు కనబడని థార్ ఎడారి ఉంది. సేద తీరేందుకు అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయి. సరదాగా ప్రకృతి అందాలు చూసేందుకు కీకారణ్యాలు ఉన్నాయి. భక్తుల తీర్థయాత్రలకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కొలువుతీరి ఉన్నాయి. అద్భుత కట్టడాలు, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఊహకందని ఎన్నో వింతలు, విశేషాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఆయా చోట్లకు ఉచితంగా విమానంలో ప్రయాణించేందుకు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఉపయోగపడతాయి.
రివార్డ్ పాయింట్స్‌ను ఎలా వాడుకోవాలి?
How to use Credit card reward points : క్రెడిట్ కార్డ్ ఉన్న భారతీయులు రివార్డ్ పాయింట్స్‌ను రెండు విధాలుగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. మొదటిది కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించుకోవడం. రెండోది క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌ను ఎయిర్‌లైన్ మైల్స్‌గా మార్చుకోవడం.
భారతదేశంలో చాలా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్లు చేసే రోజువారీ ఖర్చులపై రివార్డ్ పాయింట్స్ లేదా నిర్దిష్టమైన ఎయిర్‌లైన్ మైల్స్‌గా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిని రిడీమ్ చేసి మనం విమాన టికెట్లు కొనుక్కోవచ్చు.
కో-బ్రాండెడ్ కార్డులు - వివరాలు
- యాక్సిస్ బ్యాంకు - స్పైస్ జెట్, విస్తారాతో కలిసి కో-బ్రాండెడ్ కార్డులను అందిస్తోంది.
- ఎస్బీఐ - ఎయిర్ ఇండియా, విస్తారాతో కలిసి కో-బ్రాండెడ్ కార్డులు ఇస్తోంది.
- కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు - ఇండిగోతో కలిసి కో-బ్రాండెడ్ కార్డులను జారీ చేస్తున్నాయి.
క్రెడిట్ కార్డులు ఉన్నవారు వీటిని వినియోగించుకుని, నిర్దిష్టమైన ప్రదేశానికి విహారయాత్ర చేయొచ్చు.
రివార్డ్ పాయింట్స్‌ను ఎలా వాడుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌ను ఎయిర్‌లైన్ మైల్స్‌గా మార్చుకోవచ్చు. వీటిని రిడీమ్ చేసుకుని విమాన టికెట్లను ఉచితంగా పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఏఎమ్ఈఎక్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌ను ఎయిర్‌లైన్ మైల్స్‌గా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వీటి ద్వారా విస్తారా, స్పైస్ జెట్ విమానాల్లో భారతదేశంలోని నచ్చిన ప్రదేశానికి ప్రయాణించవచ్చు.
పరిమితి ఉంది!
విస్తారా ప్రధానంగా దిల్లీ, ముంబయి నుంచి మాత్రమే తమ విమానాలను ఈ విధానంపై నడుపుతోంది. ఫలితంగా ఇతర ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి విహారయాత్ర చేయడానికి వీలుపడదు.
- దిల్లీ నుంచి ముంబయికి ఎకానమీ క్లాస్‌లో వెళ్లాలంటే మీ వద్ద 5,000 సీవీ పాయింట్స్ ఉండాలి. అదే ప్రీమియం ఎకానమీలో వెళ్లడానికి 8,500సీవీ పాయింట్స్, బిజినెస్ క్లాస్‌లో వెళ్లడానికి 18,000 సీవీ పాయింట్లు ఉండాల్సి ఉంటుంది.
- కోల్‌కతా నుంచి ముంబయికి వెళ్లాలంటే, ఎకానమీ క్లాస్‌కు 6,000 సీవీ పాయింట్లు, ప్రీమియం ఎకానమీకి 10,000 పాయింట్లు, బిజినెస్ క్లాస్‌కు 23,000 సీవీ పాయింట్లు ఉండాలి.
దీనికి తోడు విమానయాన సంస్థలు సీవి పాయింట్లు, క్రికెట్ ఓచర్లు ఉన్న వారికి.. ప్రతి క్లాస్‌లోనూ కొన్ని లిమిటెడ్ సీట్లను మాత్రమే కేటాయిస్తున్నాయి. ఇండిగో, స్పైస్ జెట్ కూడా ఇంచుమించు ఇదే విధంగా ఫ్లైట్ టికెట్స్‌ను జారీ చేస్తున్నాయి.
గ్లోబల్ ఎయిర్‌లైన్ అలయన్స్
ఎయిర్ ఇండియా, తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మైల్స్ అండ్ స్మైల్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లను 7,500 సీవీ, 12,500 సీవీ పాయింట్లకు అందిస్తోంది. చూశారుగా.. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రెడిట్‌కార్డ్ రివార్డ్ పాయింట్స్‌ను విమాన టికెట్లుగా మార్చుకొని, భారతదేశంలోని నచ్చిన ప్రాంతానికి.. ఫ్రీగా వెళ్లి వచ్చేయండి.
ఇవీ చదవండి :