Credit Card Benefits And Loss : క్రెడిట్ కార్డు.. ప్రతి బ్యాంకు వాళ్లు ఎంపిక చేసిన తమ వినియోగదారులకు ఇచ్చే ఒక కార్డు. ఆయా బ్యాంకుల నియమ నిబంధనలు బట్టి దీన్ని మంజూరు చేస్తారు. దీని ద్వారా ముందస్తు రుణం తీసుకుని నిర్ణీత సమయంలో చెల్లిస్తే ఏ బాధా ఉండదు.. కానీ గడువు ముగిసినా చెల్లించకుంటే మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు వాడటం వల్ల రుణం తీసుకోవడం, ఏదైనా వస్తువును కొనుగోలు చేయడమే కాకుండా.. ఇంకా అనేక ఉపయోగాలున్నాయి. అవేంటంటే..
వడ్డీ లేకుండా రుణం
క్రెడిట్ కార్డుతో వాడుతున్న డబ్బు మీది కాదు. బ్యాంకుదే. కాబట్టి ఈ కార్డును ఎలా పడితే అలా వాడితే అప్పుల్లో మునిగిపోయే అవకాశముంది. అనవసర ఖర్చులు, వస్తువుల జోలికి పోకుండా అవసరమైన వాటినే తీసుకుంటే బెటర్. నిర్ణీత నెలలో క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఖర్చు చేసిన మొత్తాన్ని 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించే సదుపాయం ఉంది.
రివార్డులు
Credit Card Reward Points : క్రెడిట్ కార్డు వాడితే వచ్చే ప్రయోజనాల్లో రివార్డులు ఒకటి. మీ కార్డును ఉపయోగించి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు సదరు బ్యాంకు రివార్డులు ఇస్తుంది. మీ బ్యాంకు, కార్డు ఫీచర్లను బట్టి రివార్డు పాయింట్లు వస్తాయి. అందులో క్యాష్ బ్యాక్, ఎయిర్ మైల్స్ లాంటి ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి. అందుకే కార్డు ఎంచుకునేటప్పుడే మీ అభిరుచికి తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు వాటి గురించి అంతగా అవగాహన లేకపోతే ముందే సంబంధిత నిపుణులను సంప్రదించాలి.
మంచి క్రెడిట్ హిస్టరీ
Credit Card History : మంచి క్రెడిట్ హిస్టరీని ఏర్పరచుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. అది ఓవరాల్‌గా ఫైనాన్షియల్ వివరాలకు సంబంధించిన వాటిపై ప్రభావం చూపుతుంది. మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డులు, తక్కువ వడ్డీకే రుణాలు లాంటివి మంజూరు చేస్తాయి. క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న వాటిపై నిర్ణీత సమయంలో చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరు సైతం పెరుగుతుంది. ఇది క్రెడిట్ హిస్టరీని మరింత బలోపేతం చేస్తుంది.
ఆర్థిక మోసాల నుంచి రక్షణ
Credit Card Safety Features : క్రెడిట్ కార్డు వాడటం వల్ల ఆర్థికపరమైన మోసాల నుంచి కాపాడుకోవచ్చు. దాదాపు చాలా రకాల కార్డులు ఫ్రాడ్ ప్రొటెక్షన్ సదుపాయంతోనే వస్తున్నాయి. ఇది మీ ప్రమేయం లేకుండా జరిగే అనవసర ఖర్చులను తగ్గించడంలో సాయపడుతుంది. కార్డు పోయినా కూడా ఇతరులు దాన్ని ఉపయోగించలేరు. అంతేకాకుండా వస్తువులపై ఉన్నసేవల్ని సైతం వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఒక మర్చంట్ దగ్గర టీవీ కొన్నారు. అది సరిగా పని చేయకుంటే రీప్లేస్ చేయాలనుకున్నారు కానీ, దానికి ఆ మర్చంట్ నిరాకరించారు. అప్పుడు మీరు మీ బ్యాంకుతో ఛార్జ్ బ్యాక్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం డెబిట్ కార్డు ఉపయోగించి కొంటే ఉండదు.
ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
Credit Card Insurance : చాలా రకాల క్రెడిట్ కార్డు కంపెనీలు యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, పర్చేజ్ ప్రొటెక్షన్ లాంటి ఎన్నో ఆఫర్లు ఇస్తున్నాయి. కానీ ఇవి సదరు బ్యాంకు నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. సూపర్ ప్రీమియం, లగ్జరీ క్రెడిట్ కార్డులు లాంటివి ఉపయోగించినప్పుడు తప్ప.. మిగతా వాటిపై పెద్దగా ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోండి.
క్రెడిట్ కార్డుల వల్ల నష్టాలు
Credit Card Demerits : క్రెడిట్ కార్డులు వాడటం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలూ ఉన్నాయి. అవేంటంటే..
- అతిగా ఖర్చు చేయడం - ఎలాగూ కార్డు ఉంది కదా అని చాలా మంది అవసరమున్నా లేకున్నా లిమిట్‌కు మించి ఖర్చు చేస్తారు. కొనేటప్పుడు ఏం అనిపించదు కానీ కట్టేటప్పుడే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
- అధిక వడ్డీ రేట్లు - చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఇది ఏడాదికి 15 నుంచి 50 శాతం వరకు ఉంటుంది.
- క్రెడిట్ హిస్టరీపై ప్రభావం - కార్డుతో ఇష్టానుసారంగా కొనుగోళ్లు చేసి సమయానికి చెల్లింపులు జరపకుంటే అది మీ క్రెడిట్ హిస్టరీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.