GST Compensation: జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు మరో రూ. 86 వేల 912 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఇప్పటివరకు మొత్తం పరిహారం చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంట్లో రూ. 25 వేల కోట్లను జీఎస్టీ నిధి నుంచి విడుదల చేయగా.. మరో రూ. 61 వేల 912 కోట్లను సెస్సుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం నుంచి చెల్లించినట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి, మార్చి బకాయిలు రూ. 21,322 కోట్లు.. ఏప్రిల్, మే బకాయిలు రూ.17,973 కోట్లు.. 2022 జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న రూ. 47,617 కోట్లను కలిపి మొత్తం రూ.86,912 కోట్లను ఒకేసారి చెల్లించింది కేంద్రం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,199 కోట్లు, తెలంగాణకు రూ.296 కోట్లు ఇచ్చింది.
2017, జులై 1న దేశంలో వస్తుసేవల పన్నును (జీఎస్టీ) అమల్లోకి తెచ్చింది కేంద్రం. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటు భర్తీకి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. ఇందులో భాగంగానే కేంద్రం తాజాగా మరోసారి పరిహారం ఇచ్చింది.
ఇవీ చూడండి: 'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'.. ప్రతిపక్షాలకు అస్త్రంగా ఆర్‌బీఐ నివేదిక