COAI Director General: దేశంలో 5జీ సేవలు అందిపుచ్చుకోవడానికి, టెలికాం నెట్‌వర్క్ సంస్థలకు ఆదాయాలు సమకూర్చడం వల్ల వాణిజ్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ అభిప్రాయం సరికాదని, 5జీ సేవల ప్రారంభ దశలో టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్లడంలో రిటైల్ వినియోగదారులే ముఖ్యమని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచ్చర్ పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలికాం కంపెనీల 5జీ ఆదాయాల్లో 95 శాతం వినియోగదారుల నుంచి, 5 శాతమే సంస్థల నుంచి వస్తున్నట్లు వార్తా సంస్థ ఇన్‌ఫామిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రీ 4.0) ద్వారానే ఎంటర్‌ప్రైజ్ వ్యాపారం పుంజుకుంటుందని అన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
ప్రారంభ దశలో టెలికాం కంపెనీలకు 5జీ సేవలపై ఆదాయం ఎలా వస్తుంది ?
జ: కంపెనీల నుంచి అధికంగా, వినియోగదారుల నుంచి తక్కువగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు కానీ ఇందులో నిజం లేదు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా అప్లికేషన్‌లు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఆదాయం కోసం పరిశ్రమలు నిర్వహణ పద్ధతులు మార్చుకుని, 5జీ సాంకేతికతను వినియోగించాలి. ఇటువంటివి నెమ్మదిగా పుంజుకుంటాయి. ప్రారంభ రోజుల్లో మాత్రం ఎక్కువ ఆదాయం వినియోగదారుల నుంచే వస్తుంది. ఇండస్ట్రీ 4.0 ద్వారానే సంస్థల నుంచి ఆదాయం పెరుగుతుంది.
5జీ అందించే వేగవంతమైన ఇంటర్నెట్‌కు సాధారణ వినియోగదారులు అధిక మొత్తాలు చెల్లించలేరన్న వాదన ఉంది. దీనిపై మీ అభిప్రాయం ?
కేవలం డేటా అధిక వేగం కోసం వారు 5జీకి మారకపోవచ్చు. అయితే సామర్థ్యాల పెంపు వల్ల బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది.
ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా 5జీ సేవలకు అవకాశం ఉందా ?
దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు మేం ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే శక్తి 5జీ సేవలకు ఉంది. ప్రస్తుత ఉన్నవాటితో పోలిస్తే మెరుగైన సేవలు లభిస్తాయి. ఫలితంగా చందాదారులు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంటుంది.
దీని కోసం డేటా ధరలు తగ్గాల్సి ఉంటుందా ?
ధరలు మరీ అధికం కాకపోవచ్చు. 5జీ వ్యాప్తి కోసం టారిఫ్‌లను తగ్గించే అవకాశం తక్కువగా ఉంది. టెలికాం కంపెనీలకు తక్కువ ధరకే స్పెక్ట్రమ్ లభిస్తే అదే స్థాయిలో ధరలను నిర్ణయిస్తాయి. స్పెక్ట్రమ్ కోసం ట్రాయ్ నిర్ణయించిన ధరలను కంపెనీలు చెల్లించాల్సి వస్తే, వాటికి మూలధన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత డేటా ధరల్లో 5జీ సేవలను ఎలా అందిస్తాయో తెలియడం లేదు.
5జీ వేలంలో కనీస ధరలు తగ్గించే అవకాశం ఎంతవరకు ఉంది ?
స్పెక్ట్రమ్ కనీస ధరల కోతకు సంబంధించి ట్రాయ్ సిఫారసులు చూశాం. టెలికాం రంగంలో లాభాలు గొప్పగా ఏమీ లేవు. అయితే వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయంగా 5జీ నుంచి ఎక్కువ లాభాలు రావడం లేదన్న అభిప్రాయంతోనే ట్రాయ్ ఛైర్మన్ ఉన్నారు.
భారత 5జీ ప్రమాణాల గురించి చాలా చర్చ నడుస్తోంది. ఇది మార్కెట్‌పై ప్రభావం చూపుతుందా ?
అంతర్జాతీయ, భారత ప్రమాణాలంటూ వేర్వేరుగా ఏమీ లేవు. గ్రామీణ ప్రజలకు కూడా మెరుగైన టెలికాం సేవలందించే విధంగా భారత ప్రమాణాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల్లో భాగమైన మూడోతరం భాగస్వామ్య ప్రాజెక్ట్ (3జీపీపీ)తో కలిపే ఇవి ఉన్నాయి. మార్కెట్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు.
5జీ పరికరాలు, 5జీ బేస్ స్టేషన్, 5జీ సాఫ్ట్‌వేర్ తయారీకి చిన్న సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో అవకాశాలు ఎలా ఉన్నాయి ?
భారత్‌లో అపారమైన మార్కెట్ ఉంది. 5జీతో ఈ మార్కెట్‌కు కొత్త ఉత్తేజం రానుంది. ఇంతకు ముందు హార్డ్‌వేర్ ఆధారిత వ్యవస్థ కారణంగా సెల్యులార్ పరికరాల మార్కెట్‌లో అడుగుపెట్టడానికి భారీ మూలధనం అవసరం ఉండేది. 5జీ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఆధారిత వ్యవస్థ కావడం, పలు విడిభాగాలను చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా తయారు చేసే సౌలభ్యం ఉండటం సానుకూలాంశం.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ధరలు పెంచడానికి భయపడుతున్నాయని భావిస్తున్నారా. రిలయన్స్ జియో ఈ బాటలో నడుస్తుందా ?
ఒకప్పుడు టెలికాం సేవల్లో చిన్న సంస్థలు ఉన్న సమయంలో, ధరల పెంపు/తగ్గింపు వంటి నిర్ణయాలను పెద్ద సంస్థలు తీసుకునేవి. ప్రతి సంస్థకు టారిఫ్‌లు సున్నితమైన అంశం. మెరుగైన సేవలు అందించకుండా ధరలు పెంచితే వినియోగదారులు మరో నెట్‌వర్క్‌కు మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ అంశం ప్రతి సంస్థనూ అప్రమత్తంగా ఉంచుతుంది. ఇప్పుడు ప్రైవేటు రంగంలో మిగిలినవే మూడు పెద్ద సంస్థలు. ఈ బోర్డుల్లో అనుభవజ్ఞులు ఉన్నారు. అందువల్ల హానికర నిర్ణయాలను ఎవరూ తీసుకోరు.
మార్కెట్‌లో మూడు సంస్థల అవసరం ఉందన్నారు. కానీ వొడాఫోన్ ఐడియా పతనావస్థలో ఉంది. ఈ పరిస్థితిని ఎలా చూస్తారు ?
వొడాఫోన్ ఐడియా మూతపడాలని ప్రభుత్వం కాని, ప్రైవేటు రంగంలోని మిగిలిన 2 రెండు సంస్థలతో పాటు ఎవరూ కోరుకోవడం లేదు. భారత్‌లో మెరుగైన టెలికాం నెట్‌వర్క్ ఉండాలి. నియంత్రిత వ్యవస్థ మనకు వద్దు. మూడు సంస్థలు ఉండటం మంచిదే. ప్రస్తుతం మనకు స్థిరమైన విధానం ఉంది.
ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికాం రంగంలో విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడిందా ?
సుప్రీం కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించాలనుకోవడం లేదు. కోర్టు తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చూడండి : దేశంలో భారీగా తగ్గిన పెట్రో వాడకం.. ధరల మంటే కారణమా?