BMW I4 Electric Sedan: ఒకసారి ఛార్జింగ్ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణించే విద్యుత్ సెడాన్ ఐ4ను జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలోకి ప్రవేశ పెట్టింది. దీని ప్రారంభ ధర రూ.69.9 లక్షలు. 340 హెచ్‌పీ సామర్థ్యంతో, 5.7 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగం అందుకుంటుంది. 80.7 కిలోవాట్ అవర్ లిథియమ్ అయాన్ బ్యాటరీతో దీన్ని తయారు చేశారు. బీఎండబ్ల్యూ ఐ4లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. ప్రారంభ ఆఫర్ కింద బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ఇన్‌స్టలేషన్‌తో సహా అందించనున్నారు. దీంతో ఇంటి దగ్గరే 11 కిలోవాట్ల వరకు సురక్షితంగా ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
10 శాతం ఈవీలే: వచ్చే ఏడాది విక్రయించే మొత్తం వాహనాల్లో 10 శాతం పైనే విద్యుత్ వాహనాలు ఉంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ విక్రమ్ పావ్ అంచనా వేశారు. "విద్యుత్తు ఎస్‌యూవీ ఐఎక్స్, లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ విద్యుత్ మినీ ఎస్‌ఈ లను విడుదల చేసినపుడు మా మొత్తం విక్రయాల్లో 5 శాతం వరకు ఈవీలకు గిరాకీ కనిపించింది. ఇది ఆరోగ్యకర పరిణామం. ఐ4 విడుదలతో వచ్చే ఏడాదికి మా విక్రయాల పరిమాణంలో విద్యుత్ వాహనాల వాటా 10 శాతం పైనే ఉంటుంద"ని విక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గ్రెటా ఎలక్ట్రిక్ కొత్త విద్యుత్ స్కూటర్.. విడిగానే బ్యాటరీ, ఛార్జర్!