Best Financial Planning Tips for Childrens Wedding : ప్రతి ఒక్కరూ పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ.. కొంత మంది మాత్రమే వారి భవిష్యత్తు ప్రణాళికను పక్కాగా అమలు చేయగలుగుతారు. ఈ రోజుల్లో.. చదువులకే సంపాదన మొత్తం ధారపోయాల్సిన పరిస్థితి. చదువులు పూర్తవగానే.. పెళ్లి ఖర్చు తరుముకొస్తూ ఉంటుంది. అందుకే.. ముందు నుంచే సరైన ఆర్థిక ప్రణాళిక(Financial Planning)ను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లల వివాహానికి బెస్ట్ ప్లానింగ్ గైడ్ : వివాహం అనేది దేశంలో ఎక్కడైనా వైభవంగా జరుపుకునే ఈవెంట్. ఉత్తరాదిలో పెళ్లిళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తారని పేరు. అక్కడ సగటు జనాలు 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తారని అంచనా. దక్షిణాది విషయానికొస్తే.. రూ. 20-30 లక్షల మధ్య ఉంటుంది. అందుకే.. పిల్లల పెళ్లి కోసం కనీసం 10 నుంచి 12 ఏళ్ల ముందే ఫైనాన్సియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.
పెళ్లికి కనీసం ఎనిమిదేళ్ల ముందు నుంచైనా.. ఈ పని మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మొదట.. ఫ్లెక్సిక్యాప్ ఈక్విటీ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత.. ఆ ఫండ్‌ను విత్ డ్రా చేసుకొని సురక్షిత మార్గాల వైపు మళ్లించాలని సూచిస్తున్నారు. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)ని అమలు చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక ప్రణాళికతోపాటు బీమా : మీ పిల్లల ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రణాళికలో బీమా తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుకోకుండా ఇంటి పెద్దకు ఏదైనా జరిగితే.. కుటుంబం, పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతాయి. ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే.. మీరు చేసే ఎస్ఐపీ(SIP)కి అంతరాయం కలుగుతుంది. కాబట్టి, మీరు లేకపోయినా కూడా దీర్ఘకాలంలో కుటుంబానికి అండగా ఉండే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి.
ప్రస్తుత వ్యయం, భవిష్యత్తు విలువ : పెరుగుతున్న వస్తువులు, సేవల ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత వివాహ వ్యయంతోపాటు భవిష్యత్తులో పెరగబోయే ఖర్చును కూడా అంచనా వేయవచ్చు. దానికి అనుగుణంగానే పొదుపు ఉండాలి.
పైన పేర్కొన్న ఈ ఆర్థిక అంశాలు మీ పిల్లల వివాహానికి బడ్జెట్‌ను రూపొందించడంలో.. ఎంతో హెల్ప్ చేస్తాయి. సో.. రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే పొదుపు చేయడం అనేది అత్యంత ముఖ్యం. లేదంటే.. పిల్లలను గుండెల మీద కుంపటిలా భావించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ముందే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా...
Financial Planning: అవసరానికి ఆదుకునేలా.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా..!