మనలో చాలా మందికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకం గురించి తెలిసే ఉంటుంది. అయితే.. ఆ ఖాతాను ఏ బ్యాంకులో ఓపెన్ చేయాలి? వడ్డీ అధికంగా ఇచ్చే బ్యాంకు ఏది? వడ్డీ రేటు ఎంత లాంటి అనుమానాలు ఉంటాయి. ఈ ఎఫ్డీ అకౌంట్‌ను దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది. ఆయా అంశాలు పరిగణలోకి తీసుకుని ఖాతా తెరవడం ఉత్తమం.
పోస్టాఫీసు బెటరా?
పోస్టాఫీసులోనూ ఈ ఖాతా తెరిచే అవకాశముందని అనేక మందికి తెలియదు. బ్యాంకులో కన్నా.. పోస్టాఫీసులో ఈ ఖాతా తెరవడం బెటరని నిపుణులు చెబుతారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన కారణాలు చెబుతున్నారు. అవేంటంటే..
- ఇది ప్రభుత్వం పథకం..
పోస్టాఫీసు ఎఫ్డీలు ప్రభుత్వ పథకాలు. ఇందులో ఖాతా తెరవడం వల్ల వడ్డీ రేట్లలో అస్థిరత ఏర్పడినప్పటికీ తక్కువ ప్రభావం ఉంటుంది. అదే బ్యాంకు ఎఫ్డీలు అయితే రిజర్వు బ్యాంకు రెపో రేట్లపై ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా వివిధ బ్యాంకులు రక రకాల వడ్డీ రేట్లను అందిస్తాయి. పోస్టాఫీసు పెట్టుబడి దారులు ఎంచుకున్న మెచ్యూరిటీపై గణనీయమైన రాబడి, ఇతర ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ స్పాన్సర్ పథకం కాబట్టి సురక్షితంగా, గ్యారెంటీ రిటర్న్ ఉంటుంది. - పెట్టుబడికి భద్రత ఉంటుంది..
పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం వల్ల మన డబ్బుకు భద్రత ఉంటుంది. "మీరు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు అది డీఫాల్ట్ అయినప్పుడు, ఎత్తేసిన సందర్భంలో మనం పెట్టిన పెట్టుబడిలో రూ.5 లక్షల వరకే వస్తుంది. అదే పోస్టాఫీసు విషయానికి వస్తే.. డిపాజిట్ల విషయంలో పొదుపు పథకాలు డీఫాల్ట్ అయ్యే అవకాశమే లేదు" అని సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి చెబుతున్నారు. పేరున్న బ్యాంకుల కంటే పోస్టాఫీసు ఎఫ్డీ అధిక రాబడి ఇస్తుందని తెలిపారు. - కాలపరిమితి..
బ్యాంకు ఎఫ్డీలకు కాలపరిమితి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే పోస్టాఫీసు విషయానికి వస్తే ఇది.. ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్లుగా ఉంటుంది. - వడ్డీ రేట్లు..
ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి వడ్డీ రేటు మాత్రమే ప్రమాణికం కాకూడదు. ఇతర అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి. ఈ రేట్లు పోస్టాఫీసు విషయానికి వస్తే.. సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్లకు వరుసగా 6.8, 6.9, 7.0, 7.5 శాతం ఉంటాయి. అదే బ్యాంకులకు ఇలా ఉండదు. సాధారణ కస్టమర్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ హెచ్డీఎఫ్సీ బ్యాంకులు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు.. 3 నుంచి 7.1 శాతం వరకు ఇస్తాయి. సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు అదనంగా ఇస్తాయి. - పన్ను ప్రయోజనాలు..
పెట్టుబడిదారులు తమ వడ్డీ ఆదాయంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంకు, పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్లు రెండూ రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రారంభ పెట్టుబడికి ముందే ఉపసంహరించుకోవడం, ఎఫ్ డి డిపాజిట్ ప్లాన్ విలువకు వ్యతిరేకంగా లోన్ తీసుకోవడం కానీ చేయవచ్చు.