ఎయిర్టెల్ యూజర్లకు సూపర్ న్యూస్. తమ వినియోగదారులకు ఫ్రీగా 5జీ డేటా అందిస్తోంది ఎయిర్టెల్. అర్హులైన యూజర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. 5జీ ప్లస్ నెట్‌వర్క్‌తో సాధారణ ఇంటర్నెట్తో పోలిస్తే 30 రెట్లు వేగంతో ఈ డేటా వాడుకోవచ్చని ఎయిర్టెల్ చెబుతోంది. కానీ, అందులో మెలిక పెట్టింది. అసలేంటీ ఫ్రీ డేటా? ఎవరికి వర్తిస్తుంది? ఎలా వాడుకోవచ్చో చూద్దాం పదండి..
అన్లిమిటెడ్ ఫ్రీ 5జీ డేటా అనేది కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్ ఏం కాదు. ఇప్పటికే జియో వినియోగదారులకు ఈ వెసులుబాటు ఉంది. తాజాగా ఎయిర్టెల్ ఇలాంటి సౌలభ్యాన్ని తమ వినియోగదారులకు అందిస్తోంది. ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే యూజర్ల వద్ద కచ్చితంగా 5జీ ఫోన్ ఉండాల్సిందే. 5జీ ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎయిర్టెల్ థ్యాంక్స్/ మై ఎయిర్టెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎయిర్టెల్ థ్యాంక్స్/ మై ఎయిర్టెల్ అనేది.. ఆ సంస్థ తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యాప్. అందులో ఖాతా వివరాలు, అమలులో ఉన్న ప్లాన్లు, డేటా వినియోగం వంటి సమాచారం ఉంటుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
మై ఎయిర్టెల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే.. దానిలో లాగిన్ అవ్వాలి. ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. లాగిన్ అవ్వగానే యాప్‌లో ఓ బ్యానర్ కనిపిస్తుంది. అన్లిమిటెడ్ ఫ్రీ 5జీ డేటా అని కనిపించే ఆ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఫ్రీ 5జీ డేటా యాక్టివేట్ అయిపోతుంది. అనంతరం, 5జీ వేగంతో ఉచితంగా స్ట్రీమింగ్, డౌన్లోడింగ్, అప్లోడింగ్ చేసుకోవచ్చు.
కండీషన్స్ ఇవే..
అయితే, ఎయిర్టెల్ కంపెనీ ఇక్కడే ఓ మెలిక పెట్టింది. అన్లిమిటెడ్ 5జీ డేటాను ఉచితంగానే ఇస్తున్నట్లు చెప్పి.. ఓ నిబంధన జోడించింది. యాక్టివ్ ప్లాన్ ఉన్నవారికే ఇది వర్తిస్తుందని పేర్కొంది. నెలకు రూ.239 లేదా అంతకుమించిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారికే ఉచిత '5జీ ప్లస్' డేటా లభిస్తుందని స్పష్టం చేసింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులిద్దరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని వివరించింది. మరోవైపు, రూ.455, రూ.1799 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదని ఎయిర్టెల్ తెలిపింది.
ఇదే కాకుండా, మరో షాకింగ్ నిబంధన పెట్టింది ఎయిర్టెల్. ఫ్రీ 5జీ డేటాను యూజర్లు తమ ఫోన్లలో మాత్రమే వినియోగించుకునేలా రూల్ పెట్టింది. పీసీకి కానీ, ల్యాప్‌టాప్‌కు కానీ అనుసంధానం చేసి డేటా షేర్ చేసుకోలేరని ఎయిర్టెల్ వెల్లడించింది. హాట్‌స్పాట్ ద్వారా డేటా బదిలీ చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. యూజర్లు వారి స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఈ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఆ ప్రాంతంలోని వారికే..
ఎయిర్టెల్ 5జీ సేవలు ప్రస్తుతం పరిమిత ప్రాంతాల్లోనే నడుస్తున్నాయి. దేశంలోని 265 నగరాల్లోనే ఈ సేవలను ప్రారంభించింది ఎయిర్టెల్. ఈ ప్రాంతాల్లో నివసించే ఎయిర్టెల్ యూజర్లకే ఈ ఆఫర్ ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది.