Musk Manchester United: ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ 'మాంచెస్టర్ యునైటెడ్'ను కొనుగోలు చేస్తానంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా ట్విట్టర్‌లో మరోసారి గందరగోళం సృష్టించారు. ఈ డీల్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ట్వీట్లతో సంచలనాలు సృష్టించిన చరిత్ర మస్క్‌కు ఉండటంతో.. వెంటనే దీనిని నమ్మలేని పరిస్థితి విశ్లేషకుల్లో నెలకొంది. ఈ ట్వీట్ అనంతరం 'మాంచెస్టర్ యునైటెడ్' యజమాని అయిన గ్లాజెర్స్ ఫ్యామిలీని, మస్క్‌ను వార్తా సంస్థలు సంప్రదించగా ఎలాంటి స్పందనా రాలేదు. కొన్ని గంటల తర్వాత మస్క్ మళ్లీ స్పందిస్తూ.. ''అబ్బే లేదు.. ట్విట్టర్‌లో అత్యధిక కాలం ఉండే జోక్ ఇది.. నేను ఎటువంటి క్రీడా జట్టును కొనుగోలు చేయడం లేదు'' అని వివరణ ఇచ్చారు.
'మాంచెస్టర్ యునైటెడ్'ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ క్లబ్‌ల్లో ఒకటిగా భావిస్తారు. ఇది ఏకంగా 20 సార్లు ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. మూడు సార్లు యూరోపియన్ కప్‌ను గెలుచుకుంది. ఈ క్లబ్ మార్కెట్ విలువ మంగళవారం నాటికి 2.08 బిలియన్ డాలర్లుగా ఉంది. 2005లో ఈ క్లబ్‌ను గ్లాజెర్స్ కుటుంబం 790 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇటీవల క్లబ్ ఆట తీరు కొంత నిరాశజనకంగా ఉండటంతో గ్లాజెర్స్‌కు వ్యతిరేకంగా ఫ్యాన్స్ ఆందోళనలు చేపడుతున్నారు. గతేడాది ఇవి తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ ఎలాన్ మస్క్‌ను ట్విట్టర్‌కు బదులు ఈ క్లబ్‌ను కొనాలని కోరారు. ఈ క్రమంలో మస్క్ ట్వీట్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇటువంటి అంశాలపై అభిమానుల్లో ఆసక్తి రేపి ఆ తర్వాత జోక్ చేశానంటూ చల్లగా జారుకొన్న చరిత్ర మస్క్‌కు ఉంది.
మరోవైపు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి బయటపడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ ఒప్పందం మస్క్‌ను కోర్టుకు ఈడ్చింది.
ఇవీ చూడండి: 'నన్ను మభ్యపెట్టి ట్విట్టర్ కొనేలా చేశారు.. భారత్‌తో 'ఫైట్' నాకు చెప్పలేదు'
మస్క్ కొత్త స్కెచ్.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్!