హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో మొదలైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఈ సంస్థ స్టాక్స్ భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ వివాదం నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్ అండ్ పీ డోజోన్స్ వెల్లడించింది. ఆ మేరకు సస్టైనబిలిటీ సూచీకి ఈనెల 7న సవరణలు చేయనున్నట్లు పేర్కొంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్‌లలో అదానీ గ్రూప్ లోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.8.76 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.
అదానీ గ్రూప్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు తెరతీసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ పలు చర్యలకు ఉపక్రమించినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఇందులో భాగంగా రుణదాతలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. రుణ చెల్లింపులను ముందుగానే చేసేసి తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షేర్లు భారీగా పతనమైనప్పుడు రుణదాతలు హెచ్చరికగా మార్జిన్ కాల్స్ జారీ చేస్తుంటారు. అంటే అదనంగా నగదుగానీ, సెక్యూరిటీలనుగానీ డిపాజిట్ చేయాలని కోరతారు. ఇప్పటి వరకు ఏ రుణసంస్థ కూడా అదానీ గ్రూప్ కంపెనీలకు మార్జిన్ కాల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
అదానీ సంస్థల షేర్లు పెద్దఎత్తున అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నప్పటికీ.. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ-ఫిచ్ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, తక్షణమే అదానీ సంస్థల రేటింగ్స్ మార్చాల్సిన అవసరం లేదని ప్రకటించింది. నగదు ప్రవాహంలో పెద్దగా మార్పులు ఉండవని అంచనా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అదానీ సంస్థల్లో ద్రవ్య లావాదేవీలను మదింపు చేస్తున్నట్లు మరో రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది. ప్రస్తుత విపరిణామాలతో నిధుల సమీకరణలో అదానీ సంస్థ ఒకటి, రెండేళ్లపాటు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే భారీ ఎత్తున అదానీ షేర్లను కొనుగోలు చేసిన ఫ్రెంచ్ సంస్థ టోటల్ ఎనర్జీస్.. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది.
'అదానీ అంశం టీ కప్పులో తుపాను లాంటింది'
అదానీ షేర్లు నష్టపోయి స్టాక్ మార్కెట్లలో సృష్టించిన గందరగోళం.. టీ కప్పులో తుపాను లాంటిదని వ్యాఖ్యానించారు ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్. భారత ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉన్నాయని చెప్పారు.
టాప్ 20 నుంచీ ఔట్
ఇప్పటికే ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్ నుంచి వైదొలిగిన గౌతమ్ అదానీ.. శుక్రవారం టాప్ 20 నుంచి కూడా బయట పడ్డారు. వరల్డ్ రియల్ టైమ్స్ బిలియనర్స్ లిస్ట్ ఫోర్బ్స్ జాబితాలో 22 స్థానానికి పడిపోయారు. అదానీ సంపద 21.77 శాతం పడిపోయి ప్రస్తుతం 16.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది.
హిండెన్‌బర్గ్‌పై సుప్రీంలో పిల్
అదానీ గ్రూప్ సంపదపై నివేదిక ఇచ్చిన హిండెన్‌బర్గ్ సంస్థపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కృత్రిమంగా షేర్లు కుప్పకూలేలా చేసి.. అమాయక మదుపర్ల సంపదను దోపిడీ చేశారని ఎం.ఎల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థతో పాటు నాథన్ అండర్సన్, భారత్‌లోని ఉద్యోగులపైనా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరారు.
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మిశ్రమ ఫలితాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 910 పాయింట్లు లాభపడి 60,841 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల బాట పట్టింది. 240 పాయింట్లు లాభపడి 17,854 వద్ద స్థిరపడింది. టైటాన్, బజాబ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ షేర్లు లభాల్లో ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ మాత్రం భారీగా పతనమయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 27 శాతం, అదానీ పోర్ట్స్ 7 శాతానికిపైగా, అదానీ ట్రాన్స్‌మిషన్ 10 శాతం, అదానీ గ్రీన్ 10 శాతం, అదానీ విల్మర్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం నష్టపోయాయి. అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీలు అంబుజా సిమెంట్స్ 8 శాతం, ఎసీసీ 5 శాతం, ఎన్డీటీవీ 5 శాతం పడిపోయాయి.