Jeedimetla Major Fire Accident update : ఇరవై ఏడు గంటలు గడిచినా పూర్తిగా అదుపులోకి రాని మంటలు, అగ్నికీలల దాటికి నాలుగంతస్తుల భవనం కుప్పకూలినా, కూలిన శకలాల కింద నుంచి ఎగిసిపడుతున్న మంటలు. ఇదీ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఎస్‌ఎస్‌వీ పాలిథిన్ బ్యాగుల పరిశ్రమలోని పరిస్థితి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
జీడిమెట్ల పారిశ్రమిక వాడలో పాలిథిన్ బ్యాగుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి 27 గంటలు గడిచినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ అధికారులు, సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఇది అతి భారీ ప్రమాదంగా అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. పరిశ్రమలో ఖరీదైన విదేశీ యంత్రాలు, బ్యాగుల తయారీకి ఉపయోగించే ముడిసరకు ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
10 టీమ్లతో రంగంలోకి దిగిన అధికారులు - 8 ఫైర్ ఇంజిన్లు : పాలిథిన్ బ్యాగ్‌లు, వాటి తయారీకి ఉపయోగించే రసాయనాలు ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో భారీగా నిల్వ ఉన్నాయి. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నికీలలు ఎగిసిపడడంతో చుట్టు పక్కల పరిశ్రమలు కూడా పొగబారిపోయాయి. ఊపిరి సైతం పీల్చలేని విధంగా నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. కిలోమీటర్ల మేర ఈ పొగ కనిపిస్తోందంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పది బృందాలతో రంగంలోకి దిగిన అధికారులు 8 అగ్నిమాపక శకటాలను మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించారు.
ఏకంగా వంద నీటి ట్యాంకర్లు నిర్వరామంగా శకటాలకు నీటిని సరఫరా చేశాయి. ఒక దశలో బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనాన్ని కూడా ఉపయోగించారు. అయితే నిల్వ ఉంచిన రసాయనాలు, ఇతర పరికరాలు పెద్ద ఎత్తున పేలడంతో అక్కడున్న సిబ్బంది మొత్తం ఆందోళనతో దూరంగా పరుగులు తీశారు. మొత్తంగా నాలుగంతస్తుల పరిశ్రమ భవనం వెనుక వైపు పూర్తిగా కుప్పకూలిపోయింది. ఘటన స్థలంలో ఇంకా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో ఆరు గంటలు పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
జీడిమెట్ల పాలిథిన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - మంటల ధాటికి కూలిన భవనం - రూ.100 కోట్ల నష్టం!
బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం - ఉక్కిరిబిక్కిరైన స్థానికులు