Accidental Payments Into Your Account : కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ బ్యాంక్ కస్టమర్ల అకౌంట్లో అనుకోకుండా డబ్బులు జమ అయ్యాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో పొరపాటున వేరే వ్యక్తికి క్రెడిట్ అవ్వాల్సిన డబ్బులు మన ఖాతాల్లోకి రావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
పొరపాటును మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ అయితే, అవి మీకు సంబంధం లేదు అని భావిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. చాలా మంది తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే డబ్బు, పోయే డబ్బు గురించి అంతగా పట్టించుకోరు. ఇది అంత మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మనకు సంబంధం లేని డబ్బు మన అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు తొందరపడి దాన్ని విత్‌డ్రా చేయవద్దు. ఆ డిపాజిట్‌తో నిజంగా మీకు ఏ సంబంధం లేదా? అనుకోకుండానే మీ ఖాతాలోకి వచ్చిందా అన్న సంగతిని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఈ విషయాలు గుర్తుంచుకోండి!
- మీ అకౌంట్‌కు సంబంధించి లావాదేవీలపై మీకు సంపూర్ణ అవగాహన అవసరం. క్రెడిట్, ఉపసంహరణ (విత్‌డ్రా)పై అప్రమత్తంగా ఉండండి. అప్పుడే ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే గుర్తించేందుకు వీలవుతుంది.
- తమ ఖాతాలో అనుకోకుండా డబ్బు క్రెడిట్ అయినప్పుడు, దాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సాంకేతికంగా పొరపాటున చేసే లావాదేవీ వల్ల ఇలా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వవచ్చు. అంతమాత్రాన ఆ డబ్బు పూర్తిగా ఆ ఖాతాదారు సొంతం కాదు.
- ఒక వేళ ఎవరైనా వ్యక్తులు, లేదా సంస్థలు తమ తప్పును గుర్తించి, సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుసుకొని, ఆ నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
- కొన్నిసార్లు వ్యక్తులు, సంస్థలు ఫిర్యాదు చేసినప్పుడు బ్యాంకులు సంబంధిత అకౌంట్‌ను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలూ లేకపోలేదు. అలాంటప్పుడు సమస్య మొత్తం పరిష్కారమైతేనే ఖాతాను మీరు ఉపయోగించుకోగలరు.
- పొరపాటున మీ అకౌంట్లో తప్పుగా డబ్బు జమ అయివుంటే అన్ని వివరాలూ ఒక సారి చూసుకోవాలి. ఆ డబ్బుతో మీకు ఎలాంటి సంబంధం లేదని భావించినప్పుడు బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి.
- కొన్నిసార్లు ఖాతాలోకి డబ్బు ఏవిధంగా అకౌంట్లోకి వచ్చిందో తెలుసుకోవడం సాధ్యం కాకపోతే బ్యాంకు ఆ వివరాలు సేకరిస్తుంది. మీ సూచనలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది.
అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నెగిటీవ్లోకి వెళ్తుందా? - ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!