Accenture Skips Pay Hikes : ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఎక్సెంచర్.. భారతదేశంలోని తమ ఉద్యోగుల జీతాల పెంపును 2024 జూన్ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి ఉద్యోగుల పదోన్నతులను కూడా వాయిదావేయాలని నిర్ణయించింది. అంతేకాదు సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి నియామకాలను కూడా వాయిదా వేయాలని నిశ్చయించింది.
డిసెంబర్లో ప్రమోషన్స్!
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఎక్సెంచర్.. తమ కింది స్థాయి ఉద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలిగించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కెరీర్ లెవల్ 5 లోపు ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్ కల్పిస్తామని స్పష్టం చేసింది.
బోనస్ గ్యారెంటీ!
భారతదేశంలో సుమారుగా 3 లక్షల మంది ఎక్సెంచర్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. వీరికి సాలరీలు పెంచకపోయినప్పటికీ.. వారి వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్‌లు కల్పిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
బుకింగ్స్ తగ్గాయి!
2023 ఆర్థిక సంవత్సరంలో ఎక్సెంచర్ 4 శాతం వృద్ధితో 16 బిలియన్ డాలర్ల మేర లాభాలు పొందింది. అయితే ఇది కంపెనీ ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తం కావడం విశేషం. అంతేకాదు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్త బుకింగ్‌లు 18.4 బిలియన్ డాలర్ల నుంచి 16.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీనితో కంపెనీ తమ ఉద్యోగుల జీతభత్యాలను, పదోన్నతులను వాయిదా వేయాలని నిర్ణయించింది.
నవంబర్ 1 నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు!
Infosys Salary Hike 2023 : దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. నవంబర్ 1 నుంచి తమ ఉద్యోగులు అందరికీ జీతభత్యాలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగ నియామకాలు లేవ్!
ఇన్ఫోసిస్ కంపెనీ ఈ ఏడాది కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని.. ఆ సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) నీలాంజన్ రాయ్ స్పష్టం చేశారు.
2023 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 3.17 శాతం లాభాలతో ఇన్ఫోసిస్ రూ.6,212 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గతేడాదితో పోలిస్తే కనీసం రూ.200 కోట్ల మేర అదనపు లాభం సంపాదించింది.
టీసీఎస్‌లో వారికి మాత్రమే జీతాల పెంపు!
TCS Salary Hike 2023 : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగుల్లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగిలిన 30 శాతం మంది ఉద్యోగులకు వారి వ్యక్తిగత పనితీరు ఆధారంగా వేతనం పెంచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
2023 సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ రూ.11,342 కోట్లు (8.7 శాతం) మేర లాభాలను గడించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.10,431 కోట్లుగా ఉంది.